సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పౌరులమని.. రాజ్యాంగం పౌరులైన మనకు అనేక హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. అయితే, ప్రతి ఒక్కరూ తనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ఒకటి ఓటు వేయడమని చెప్పారు.
గొప్ప మాతృభూమి పౌరులుగా బాధ్యతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని అందరినీ అభ్యర్థిస్తున్నానని చంద్రచూడ్ తెలిపారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు నిమిషాలు కేటాయించవచ్చని, గర్వంగా ఓటు వేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులకు పాత్ర ఉందని, అందుకే రాజ్యాంగంలో ‘భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు’ అని రాసుందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సీజేఐ ఆయన తొలిసారిగా ఓటరుగా ఓటు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందని చెప్పారు. న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో ఓటు వేయడంలో విఫలం కాలేదన్నారు.
దేశ పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఓటింగ్ జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడవడనున్నాయి.