ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ప్రజలు బీజేపీకే పట్టం కడుతారని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో వెల్లడైంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 296 లోక్‌సభ సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి సొంతంగా 271 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే చెప్పింది.
మరోవైపు ప్రధానిగా నరేంద్ర మోదీకే మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారు. దాదాపు 53 శాతం మంది ఆయనకు మద్దతు ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మోదీకి 50 శాతం మందికి పైగా మడ్దతు ఇచ్చారు. పంజాబ్‌లో మాత్రమే ఆయనకు మద్దతు కాస్త తగ్గింది.
ప్రధాని మోదీ పని తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి జనం జై కొడుతారు? ప్రతిపక్షాలను లీడ్ చేసే పార్టీ మారుతుందా? తదితర 10 అంశాలపై ఇండియా టుడే సర్వే చేసింది.
తాము చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు పార్లమెంటు నియోజకవర్గాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పింది. ఈ మీడియా సంస్థ తమ సర్వే ఫలితాలను ఏటా జనవరి, ఆగస్టులో విడుదల చేస్తుంటుంది.
వీరి ప్రకారం బిజెపికి 271, కాంగ్రెస్ కు 62, టిఎంసికి 35, ఆప్ కు 4, ఇతరులకు 171 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
తర్వాతి ప్రధానిగా 53 శాతం మంది మోడీ పేరు చెప్పారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్‌కు 6 శాతం, అమిత్ షాకు 4 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఈ నలుగురిలో ముగ్గురు బీజేపీ నేతలే కావడం గమనార్హం.
దేశంలో ప్రతిపక్ష పార్టీలను లీడ్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే బెటర్ అని సర్వేలో తేలింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కంటే మమతకే ఎక్కువ రేటింగ్ వచ్చింది. మమతకు 17% మంది, ఢిల్లీముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు 16% మంది, రాహుల్ కి 11% మంది మద్దతు ఇచ్చారు.
ఆరు నెలల కిందటితో పోలిస్తే తాజాగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పెరిగింది. గత ఆగస్టులో చేసిన సర్వేలో 53 శాతం మంది ఎన్డేయే ప్రభుత్వంతో సంతృప్తి చెందినట్లు చెప్పారు. ఇప్పుడు మద్దతు ఇచ్చేటోళ్లు 59 శాతానికి పెరిగారు. ఇదే సమయంలో అసంతృప్తుల సంఖ్యా గతంతో పోలిస్తే పెరిగింది. ఆగస్టులో 17 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు ఇది 26 శాతానికి చేరింది.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్‌లో ప్రధాని పనితీరుపై 50 శాతంకన్నా ఎక్కువ అప్రూవల్ పాయింట్లు వచ్చాయి. ప్రజాదరణతో స్థానిక ముఖ్యమంత్రులకన్నా ఆయనే ముందున్నారు. ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు 49 శాతం అప్రూవల్ పాయింట్లు వచ్చాయని ఎంవోటీఎన్ పోల్ తెలిపింది.