తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో రేవంత్‌కు పోలీసులు ఈ సమన్లు అందించారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకున్న ఢిల్లీ పోలీసులు సమన్లు అందజేశారు. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇదిలా ఉండగా.. అమిత్ షా ఇటీవల తెలంగాణ పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే, షా ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. అదే సమయంలో ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి.
కాగా, సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చిన ఇద్దరు దిల్లీ పోలీసు అధికారులు, తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఛైర్మన్ మన్నె సతీశ్‌తోపాటు మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. దిల్లీలో హోంశాఖకు చెందిన ఉద్యోగి సింకు శరణ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 28వ తేదీన దిల్లీలోని సైబర్ క్రైం ప్రత్యేక విభాగం కేసు నమోదు చేసింది.
ఐపీసీ సెక్షన్లు 153, 153 ఏ, 465, 469, 171 జీ, ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. హోంమంత్రి అమిత్ షాకు చెందిన వీడియోలు మార్ఫింగ్ చేసి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో షేర్ చేయడం ద్వారా ప్రజల్లో అశాంతిని రేకెత్తించేట్లు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కుట్ర పూరితంగా వీడియోలు షేర్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు ఎక్కడ షేర్ చేశారు. ఎవరు షేర్ చేశారన్న విషయాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. సున్నితమైన అంశమైనందున తాము ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని తెలిపారు.
పీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్ మన్నె సతీశ్, పీసీసీ కార్యదర్శి అంబల శివకుమార్, పీసీసీ అధికార ప్రతినిధి అస్మా తస్లీమ్, సామాజిక మాధ్యమం పిట్టం నవీన్‌కు నోటీసులు ఇచ్చారు. సీఆర్పీసీ 91, 160 కింద నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు, అక్కడ నుంచి వెళ్లిపోయారు.
