తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని వెల్లడించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఓటర్లను కోరారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో ఓటు వేశారు. మంగళగిరిలో పవన్ కల్యాణ్, కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం జిల్లా తొగరాంలో తమ్మినేని సీతారాం, గాజువాక మింది గ్రామంలో మంత్రి అమర్నాథ్, అన్నమయ్య జిల్లా నగిరిపల్లిలో మాజీ సీఎం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ కరెన్సీ నగర్లో కేశినేని నాని, శ్రీకాకుళం పెద్దపాడులో ధర్మాన ప్రసాదరావు, విశాఖలో జీవీఎల్ నరసింహారావు ఓటు హక్కు వినియోగించుకన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసనపల్లి గ్రామం లో పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకు వెళ్లే విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత నెల్లూరి రామకోటయ్య సహా మరి కొందరికి గాయాలయ్యాయి. ఇరు పక్షాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ఓటు హక్కును వినియోగించుకోడానికి ఓటర్లు తరలి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశానని, ఓటు ప్రాథమిక హక్కు. ఓటు వేసేందుకే ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజు సెలవు ఇచ్చిందని, ప్రజలు దీన్ని సాధారణ సెలవుదినంగా పరిగణించ వద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండుగ అన్నారు. దేశ అభివృద్ధి, దేశ భద్రత, సంక్షేమం కోసం ఓటు వేయాలన్నారు. ప్రజలందరూ ప్రజస్వామ్య పండుగలో పాల్గొని ఓటు వేయాలి”అని కిషన్ రెడ్డి కోరారు.