సీఏఏ చట్టం అమలులోకి తీసుకుచ్చిన అనంతరం తొలిసారిగా కేంద్రం పలువురికి పౌరసత్వ ధ్రువీకరపత్రాలను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద బుధవారం తొలిసారిగా ఢిల్లీలోని 14 మంది శరణార్థులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అందజేశారు.
దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 31వేల మంది ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల్లో సీఏఏ అంశంపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతుండడం విశేషం.
సీఏఏని వ్యతిరేకిస్తున్న పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలుగా బీజేపీ విమర్శిస్తున్నది. ముస్లిం సమాజాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ఈ ఏడాది మార్చి 11 నుంచి దేశంలో అమల్లోకి వచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లు 2019 పార్లమెంట్ ఆమోదించిన అనంతరం ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
సీఏఏ చట్టం ద్వారా పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందు, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ వర్గాలకు పౌరసత్వం కల్పించనున్నట్లు పేర్కొంది. 2014 డిసెంబర్ 31.. లేదా అంతకన్నా ముందు వచ్చిన ఆయా ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వనున్నది.