కలకత్తా హైకోర్టు జడ్జీగా సోమవారం రిటైర్ అయిన జస్టిస్ చిట్ట రంజన్ దాస్ ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)పై తన ప్రేమను చాటుకున్నారు. ‘ఇప్పటికీ, ఎప్పటికీ నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడినే. అవసరమైతే ఆర్ఎస్ఎస్లోకి తిరిగి వెళ్లిపోతాను,’ అంటూ ఇతర న్యాయమూర్తులు, బార్ సభ్యుల సమక్షంలో చేసిన వీడ్కోలు ప్రసంగంలో వ్యాఖ్యానించారు జస్టిస్ చిట్ట రంజన్ దాస్.
“నేను ఇప్పుడు చెప్పేది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ.. నేను ఇప్పటికీ, ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ సభ్యుడినే. ఇప్పుడు రిటైర్ అవుతున్నాను. నేను చేయగలిగినది ఏమైనా ఉంటే, ఆర్ఎస్ఎస్ నాకు బాధ్యతలు అప్పగిస్తే.. కచ్చితంగా చేస్తాను,” అని చెప్పుకొచ్చారు జస్టిస్ చిట్ట రంజన్ దాస్.
ఒడిశా హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ మీద కలకత్తా హైకోర్టుకు వెళ్లిన జస్టిస్ దాస్.. సోమవారం రిటైర్ అయ్యారు. “నేను ఆర్ఎస్ఎస్కి చాలా రుణపడి ఉన్నాను. నా బాల్యం, యుక్త వయస్సు అంతా అందులోనే గడిపాను. ధైర్యంగా, నిజాయతీగా ఎలా ఉండాలో అక్కడే తెలుసుకున్నాను. వీటన్నింటి కన్నా ముఖ్యమైన.. దేశభక్తి, పని పట్ల నిబద్ధత వంటివి ఆర్ఎస్ఎస్లోనే నేర్చుకున్నాను,” అని జస్టిస్ చిట్ట రంజన్ దాస్ తెలిపారు.
\తాను చేస్తున్న వృత్తి వల్ 37ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్కు దూరంగా ఉండాల్సి వచ్చిందని జస్టిస్ దాస్ తెలిపారు. “నా కెరీర్ కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో నేను ఆర్ఎస్ఎస్ సభ్యత్వాన్ని ఎప్పుడూ వాడుకోలేదు. అది నా విలువకు విరుద్ధం,” అని జస్టిస్ చిట్ట రంజన్ దాస్ తెలిపారు.
“ధనికుడైనా, పేదవాడైనా, కమ్యునిస్ట్ అయినా, బీజేపీ- కాంగ్రెస్- తృణమూల్ కాంగ్రెస్ అయినా.. నేను అందరిని సమానంగా చూశాను. నాకు అందరూ సమానమే. ఎవరి మీదా నాకు వివక్ష లేదు,” అని సోమవారం వరకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దాస్ చెప్పుకొచ్చారు. న్యాయం కోసం చట్టాలను వంచినా పర్లేదు కానీ.. చట్టాల కోసం న్యాయం తలొగ్గకూడదని జస్టిస్ దాస్ అభిప్రాయపడ్డారు.
“నేను జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే.. నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడిని అని ధైర్యంగా చెబుతున్నాను. నేను మంచి వాడినైతే.. తప్పుడు వ్యవస్థలో ఉండను,” అని చెప్పుకొచ్చారు జస్టిస్ చిట్ట రంజన్ దాస్.
1962 ఒడిశా సోనీపూర్లో జన్మించిన జస్టిస్ చిట్ట రంజన్ దాస్.. ఉల్లుండలో చదువుకున్నారు. భువనేశ్వర్‌లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని.. 1985లో కటక్ నుంచి లా పట్టా పొందారు.
1986లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్న ఆయన 1992లో ఒడిశా ప్రభుత్వానికి అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 1994 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 ఫిబ్రవరిలో ఒడిశా సుపీరియర్ జ్యుడీషియల్ సర్వీస్‌లో చేరారు. 2009లో ఒడిశా హైకోర్టు అడిషనల్ జడ్జిగా ప్రమోషన్ లభించింది. ఇక 2022 జూన్ 20న.. కలకత్తా హకోర్టు జడ్జిగా బాధ్యతలు తీసుకున్నారు. 2024 మే 20 వరకు ఆ బాధ్యతలను కొనసాగించారు.