అసమాన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె, అనితా బోస్ ఫాఫ్ మాట్లాడుతూ, నేతాజీ వారసత్వం సంవత్సరాలుగా దోపిడీ చేయబడిందని, కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం, వారసత్వాన్ని ఇవ్వలేదని ఆరోపించారు.
“నేతాజీ వారసత్వం దోపిడీకి గురయింది. నేతాజీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఉంది. తిరుగుబాటుదారుడైన మా నాన్నను మేనేజ్ చేయలేక పోవడం వల్ల గాంధీ నెహ్రూకు మొగ్గు చూపారు” అంటూ జీ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.
ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ, భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది అద్భుతమైన గుర్తింపు అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆ విగ్రహం గురించి తెలిసి తాను “ఆశ్చర్యపోయాను” అని ఆమె చెప్పింది.
ఈ అంశంపై మైలేజీని పొందేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని, అయితే ఆ తర్వాత ఏమీ జరగలేదని అనితా బోస్ ఫాఫ్ పేర్కొన్నారు. నేతాజీ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉండకూడదని ఆమె హితవు చెప్పారు.
భారతదేశంలోని ప్రస్తుత మతపరమైన విభజన, మతపరమైన పరిస్థితులను ప్రస్తావిస్తూ, అనితా బోస్ ఇంకా మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిందువుగా శ్రద్ద గల వ్యక్తి అని, అయితే ఆయన మతం పేరుతో మరొక వ్యక్తిని బాధపెట్టడం లేదా చంపడం చేయలేదని ఆమె తెలిపారు.
“నేతా జీ హిందువుగా ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వారైనప్పటికీ, భారత దేశ విభజన తర్వాత మనం చూసినట్లుగా ఆయన మతం పేరుతో ప్రజలను చంపలేదు” అని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేతాజీ ప్రతిష్టను వక్రీకరిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనితా బోస్ ఫాఫ్ మాట్లాడుతూ, తన తండ్రి హిట్లర్‌ను రెండుసార్లు కలిశారని, అయితే భారత స్వాతంత్య్రం, మరియు బ్రిటిష్ దళాలపై పోరాటాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని కలిసారని ఆమె చెప్పారు.
“నేతా జీ హిట్లర్‌ను కలిశాడు, ఎందుకంటే ఆయన భారతీయ స్వాతంత్య్రం కోసం శ్రద్ధతో పనిచేశారు. కానీ ఆయన ఫాసిజాన్ని ఆమోదించాడని అర్థం కాదు.” ఆమె ఇంకా ఇలా చెప్పింది, “నేతా జీ ముస్సోలినీని కూడా రెండుసార్లు కలిశాడు. ఆయన జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు కలసి భారత దేశ స్వాతంత్య్ర తీర్మానంపై సంతకం చేయాలని కోరుకున్నారు” అని ఆమె వివరించారు.