జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి, రాజకీయాలపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతూ ఉండడం, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడంతో పాటు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడంతో ముందస్తు ఎన్నికలు అనివార్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
పైగా, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తో జత కలపనిదే వైసిపిని ఎదుర్కోవడం కష్టం అని ఒక వంక తెలుగు దేశం పార్టీ, మరోవంక బిజెపి భావిస్తున్నాయి. అందుకనే ముందుగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ట పరచుకోవడంతో పాటు, నేరుగా ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల పొత్తుల గురించిన గందరగోళంలోకి ఇప్పుడు వెళ్లకుండా బలమైన నియోజకవర్గాలు, అభ్యర్థుల ఎంపిక పట్ల దృష్టి సారించేందుకు కసరత్తు చేయనున్నట్లు చెబుతున్నారు.
జనసైనికుల అభీష్టం మేరకే ఎన్నికల పొత్తు ఉంటుందని ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ప్రజలను సమీకరింపగల శక్తీ మిగిలిన ప్రతిపక్షాలకన్నా జనసైనికులకే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకనే గత ఎన్నికల వలే తగు సన్నాహాలు లేకుండా ఎన్నికలలో పోటీ చేయకుండా, ముందు నుంచే సిద్దపడటం ద్వారా వచ్చే అసెంబ్లీలో జనసేనను నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా నిలబెట్టాలను ప్రణాళికలు రూపొందించడం పట్ల దృష్టి సారింపనున్నారు.
దాదాపు మూడేళ్ల విరామం తరువాత ‘వకీల్ సాబ్’ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఘన విజయం సాధించారు. కరోనా రెండు వేవ్ ఉదృతంగా ప్రారంభం అవుతున్న దశలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది.
ఈ మూవీ తర్వాత పవన్ వరుసగా భారీ ప్రాజెక్టులను చేబడుతున్నట్లు ప్రకటించారు. ‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన కొద్దిపాటి టాకిపార్ట్ మినహా మిగతా చిత్రీకరణ మొత్తం పూర్తైంది.
దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తైన ఈ సినిమా రెండో వేవ్ సమయంలో పవన్ కరోనా బారిన పడటంతో ఆగిపోయింది. మళ్ళీ తిరిగి సెట్స్ మీదకు తీసుకురావాలనుకుంటున్న సమయంలో మూడో వేవ్ మొదలై రోజు రోజుకు లెక్కకు మించి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
దీన్ని దృష్ఠిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్స్ ఏవీ పెట్టొద్దని దర్శక, నిర్మాతలకు సూచించారట. కొద్దిపాటి చిత్రీకరణ పూర్తి చేయాల్సిన ‘భీమ్లా నాయక్’ తప్ప మిగతా సినిమాల షూటింగ్లో చేరలేనని పవన్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే తాను ఒప్పుకున్న చిత్రాల షూటింగ్లో పాల్గొంటారట. ఇక ఫిబ్రవరి 25న రిలీజ్ కావాల్సిన ‘భీమ్లా నాయక్’ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.