దేశ రక్షణ, భద్రతే ప్రధానం అని పదే పదే చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందుకు తగిన అధికారులను కీలక హోదాల్లో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ భద్రతా సలహాదారునిగా (ఎన్ఎస్ఏ) మరోసారి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అజిత్ ధోవల్కే అవకాశం దక్కింది. జాతీయ భద్రత సలహాదారుగా అజిత్ ధోవల్‌ను కొనసాగిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఎన్ఎస్ఏగా ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. జూన్ 10 వ తేదీ నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీకాలం పూర్తయ్యేవరకు లేదా తర్వాతి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎన్ఎస్ఏగా అజిత్ ధోవల్ ఉంటారని.. సిబ్బంది వ్యవహారాలశాఖ వెల్లడించింది.
ఇక ఈ పదవీకాలంలో అజిత్ ధోవల్‌కు కేబినెట్ మంత్రి హోదాను కల్పిస్తారు. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2014 మే 30 వ తేదీన జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్ తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2014 కు ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా అజిత్ ధోవల్ పనిచేశారు. ఇక ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులను వెలువరించింది.
1945 లో ఉత్తరాఖండ్‌లో పుట్టిన అజిత్ ధోవల్ 1968 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఇక 2005 లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ జాతీయ భద్రత సలహాదారుగా అజిత్ ధోవల్ నియామకం అయ్యారు.
2016 లో పీఓకేలో భారత్జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో అజిత్ ధోవల్ కీలకంగా వ్యవహరించారు. డోక్లాం విషయంలో చైనాతో పరిస్థితులను చక్కబెట్టడంలో ఆయన తీవ్రంగా కృషి చేశారు. దీంతో ఈసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికవడంతో ధోవల్‌కు అదే పదవి కట్టబెట్టారు.