భారత్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని నేతాజీ ముందే ఊహించారని ఆయన కుమార్తె అనితా బోస్ పిఫాప్ తెలిపారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రజలను ఉద్దేశించి జర్మనీ నుంచి ఆమె ఓ సందేశాన్ని విడుదల చేశారు.
నమస్కారంతో తన సందేశాన్ని ప్రారంభించిన అనిత.. ‘‘భారతదేశానికి నమస్కరిస్తున్నా. మహమ్మారితో దేశం పోరాడుతున్న ఈ సమయంలో భారతీయ ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నా. ప్రజలు నిత్యం స్మరించుకునే భారత బిడ్డ, నా తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 సంవత్సరాల క్రితం కటక్‌లో జన్మించారు. ఆయన 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేతాజీని గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
దేశంపై తన తండ్రికి ఉన్న ‘విజన్’ గురించి మాట్లాడుతూ.. ‘‘నేతాజీ ఆలోచనాపరుడు మాత్రమే కాదు, చేతల మనిషి కూడా. దేశంపై ఆయనకో ‘విజన్’ ఉంది. ఈ దేశం ఆధునికమైనది, తత్వశాస్త్రంలో, మతపరమైన సంప్రదాయాలలో చరిత్రలో వేళ్లూనుకుపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని నేతాజీ ముందే ఊహించారు” అని ఆమె చెప్పారు.
“తాము ఎదుర్కొనే వ్యక్తులలో ఆయన కూడా భాగం కావాలని ఆశించారు. దురదృష్టవశాత్తు అది జరగలేదు’’ అని అనితా బోస్ తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులంత గొప్పవాళ్లం కాకపోయినా మనం మన భారత్ కోసం, మన భారతీయ పౌరుల కోసం, ప్రపంచ పౌరుల కోసం మనవంతు సహకారం అందిద్దామని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
“నేతాజీ భక్తిపరుడు. భక్తుడైన హిందువు. హిందువు అన్ని ఇతర మతాల పట్ల సహనం కలిగి ఉంటాడు. కుటుంబ సభ్యులు, అనుచరులు, స్నేహితులు అందరూ అన్ని మతాలను గౌరవించేలా, నిజాయతీగా ఉండేలా నేతాజీ ప్రేరణ ఇచ్చారు” అని ఆమె తెలిపారు.
నేతాజీ భావోద్వేగం దేశంపై ఆయనకున్న ప్రేమ సహా అన్నింటినీ మించిపోయింది. స్నేహితులు, కుటుంబంపై ఎనలేని విధేయత చూపేవారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. నేతాజీ ఆలోచనలు, ఆదర్శాల నుంచి మనందరం ప్రేరణ పొందగలమని నేను ఆశిస్తున్నాను. నమస్కారం, ‘జై హింద్’” అని ఆమె తన సందేశాన్ని ముగించారు.