లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నూతన ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌గా రెండేళ్లు సేవలందించిన జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయగా, ఆయన నుండి బాధ్యతలు చేపట్టారు.
2022 ఏప్రిల్ 30న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మే 30న పదవి విరమణ చేయాల్సి వుంది. అయితే కొత్త చీఫ్‌ని ప్రకటించడంలో జాప్యం కారణంగా కేంద్రం ఆయన సర్వీసును నెలరోజుల పాటు పొడిగించింది. జూన్ 11న వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదిని నూతన చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న సైన్యం (జమ్ము కాశ్మీర్ రైఫిల్స్)లో చేరారు. కమాండ్ ఆఫ్ రెజిమెంట్ (18 జెకెరైఫిల్స్), బ్రిగేడ్ (26 సెక్టార్ అస్సాం రైఫిల్స్), డిఐజి, అస్సాం రైఫిల్స్ (తూర్పు), 9 కార్ప్స్ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో ద్వివేది సహ విద్యార్థి. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరూ దేశ రక్షణ దళాల అత్యుత్తమ కమాండర్లుగా నియమితులు కావడం గమనార్హం.