దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన తమ పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉందని ఆమె గుర్తు చేశారు.
“మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం” అని విజయశాంతి హెచ్చరించారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్… రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదంతా చేస్తుంటే… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత… లేకుంటే ఎంత? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
కాగా, తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోలీస్ కమీషనర్ అని అంటూ దాడి చేసిన వారంతా టీఆర్ఎస్ నేతలేనని అరవింద్ ఆరోపించారు. దాడి జరిగిన స్థలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. రాళ్లు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఆ నియోజకవర్గంలో వ్యాపించిన గంజాయి ముఠా వెనుక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉన్నారని అర్వింద్ ఆరోపించారు.