జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ కెప్టెన్ అమరుడయ్యారు. ఈ ఎన్కౌంటర్లోనే నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారుల వెల్లడించారు. దోడా జిల్లాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవం వేళ ఉదమ్‌పుర్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
సిబ్బంది ఎదురుకాల్పులు జరపడం వల్ల దుండగులు దోడా జిల్లాలోని అడవుల్లోకి ప్రవేశించి ఉంటారని అధికారులు భావించారు. దీంతో మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో శివగఢ్ – అస్సార్ బెల్ట్‌లో భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు దాడికి దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక సామాన్య పౌరుడు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఇక మరణించిన ఉగ్రవాదుల దగ్గర నుంచి ఒక ఎమ్4 కార్బైన్, ఇతర ఆయుధాలతో పాటు రక్తం మరకలు ఉన్న నాలుగు బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద దాడులపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా సంబంధిత సంస్థల అధికారులు హాజరయ్యారు.
ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే జమ్ములోని ఓ ఉగ్ర సంస్థ నుంచి దాదాపు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది.
కేవలం ఆగస్టు 15నే ఈ దాడి జరుగుతుందని చెప్పలేమని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భద్రతా చర్యలు భారీగా ఉండటం వల్ల రెండ్రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నాయి.