ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్లే మంత్రి అతిశీని కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆమె శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు.
ప్రస్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అనంతరం మంత్రి అతిషి సీఎం బాధ్యతలను చేపట్టనున్నారు. ఆమె పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతవారం బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ నెల 26,27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సమయంలో అతిషి పార్టీ కోసం కీలకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్ లేని లోటును భర్తీ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేశారు.
ఫలితంగా.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించినప్పటి నుంచి ఆ బాధ్యతలు అతిషికి వెళతాయని ఊహాగానాలు జోరుగా సాగాయి. చివరికి అదే నిజమైంది! అతిషి పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ కీలక నేతగా ఉంటూ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ సహా 10కిపైగా పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలు జైలులో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆమె ముందుండి నడిపించారు.
దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించిన ఘనత అతిషికే దక్కుతుంది. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సలహాదారుగా, పాఠశాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో, బోధనా ప్రమాణాలను మెరుగుపరచడంలో, “హ్యాపీనెస్ కరిక్యులమ్” – “ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్‌సెట్ కరిక్యులమ్” వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు. కల్కాజీ నియోజకవర్గం నుంచి దిల్లీ శాసనసభ సభ్యురాలు. తొలుత దిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారుగా ఎదిగిన ఆమె 2020 ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పొందిన అతిషి ఆ తర్వాత చెవెనింగ్ స్కాలర్‌షిప్‌పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి విద్యలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమె విద్యా నేపథ్యం దిల్లీలో చేపట్టిన విద్యా సంస్కరణలో ఆమె కృషిని గణనీయంగా ప్రభావితం చేసింది.