రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు.
యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్ మహీంద్రా ఆనంద్కు అప్పగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న మహీంద్రా ఆనంద్ స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్ యూనివర్సిటీ నెలకొల్పి 2028 ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలన్న లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని, రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఆర్థిక సహకారానికి మించి, రాష్ట్రంలోని అందరూ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించినంత చొరవ ప్రదర్శించాలని తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని ఆయన కోరారు.