కర్ణాటకలోని ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే లోకాయుక్త కేసు నమోదు చేయడం, విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రికి మరో బిగ్ షాక్ తగిలింది. కర్ణాటకలోకి సీబీఐ రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈడీ రంగంలోకి దిగింది.
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-ముడా భూముల వ్యవహారానికి సంబంధించి భారీగా డబ్బులు చేతులు మారాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి.. సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కాగా, ఈ కేసు నమోదు చేసిన గంటల లోగా తనకు ముడా కేటాయించిన ప్లాట్లను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు తెలుపుతూ ముడా కమిషనర్ కు సిద్దరామయ్య భార్య ఓ లేఖను వ్రాసారు.
ముడా భూముల స్కామ్‌లో కర్ణాటక లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. సిద్ధరామయ్య, సహా పలువురిపై కేసు పెట్టింది. ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ముడా కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన లోకాయుక్త.. ఏ1గా సీఎం సిద్ధరామయ్య పేరును, ఏ2గా ఆయన భార్య పార్వతి, ఏ3గా ఆయన బావమరిది మల్లికార్జున్ పేర్లను చేర్చింది.
ఈ నేపథ్యంలోనే ఇటీవలె సిద్ధూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఏ కేసులోనైనా విచారణ కోసం వచ్చేందుకు సీబీఐకి ప్రస్తుతం ఉన్న సాధారణ అనుమతిని రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటకలో సీబీఐ విచారణ జరిపే ప్రతి కేసునూ పరిశీలించాకే అనుమతివ్వాలని నిర్ణయించింది.
సీబీఐ పక్షపాతిగా వ్యవహరిస్తోందని, రాష్ట్రం అనుమతించిన చాలా కేసుల్లో సీబీఐ ఛార్జ్‌షీట్ కూడా తెరవలేదని పేర్కొంది. గాడి తప్పుతున్న సీబీఐని కంట్రోల్లో పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక తెలిపింది. అయితే సీబీఐకి నో ఎంట్రీ చెప్పడానికి.. సీఎం సిద్ధరామయ్యపై నమోదైన ముడా కుంభకోణం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముడా భూముల కేటాయింపు, స్కామ్‌కు సంబంధించి పలువురు ఫిర్యాదులు చేయడంతో కర్ణాటక లోకాయుక్త అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య సహా మరికొందరిపై లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ముడా భూముల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందారని.. అందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడినట్లు.. కొన్ని కీలక ఆధారాలతో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం.. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.