ఈ ఏడాది జనవరిలో రూ.1,213 కోట్ల విలువైన ఎలక్టొరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించగా, వీటిలో అత్యధిక భాగం (రూ.784.84 కోట్లు) ఎస్బిఐ న్యూఢిల్లీ బ్రాంచిలో జాతీయ రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి.. ఈ ఎలక్టొరల్ బాండ్లలో అధికంగా (రూ.489.6 కోట్లు) ముంబయి ఎస్బిఐ బ్రాంచిలో అమ్ముడయ్యాయి.
సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఎస్బిఐ ఈ వివరాలు వెల్లడించింది. .గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, యుపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ఈ సమయంలో ఎలక్టొరల్ బాండ్ల విక్రయం జరిగింది.
ఆర్టిఐ కార్యకర్త కన్నయ్య కుమార్ ఆడిగిన ప్రశ్నకు ఎస్బిఐ సమాధానమిస్తూ, ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు అమ్ముడైనంత భారీగా ఇంతకుముందు ఏ ఎన్నికల్లోనూ అమ్ముడుపోలేదని తెలిపింది. ఎలక్టొరల్ బాండ్ల పథకం 2018లో ప్రారంభమైన తరువాత పందొమ్మిదో విడతగా గత నెల 1నుండి 10 వరకు బాండ్ల అమ్మకం సాగింది.
2021ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమ్ముడుపోయిన బాండ్ల విలువ (రూ.695 కోట్లు)తో పోల్చితే ఇది రెండింతలు అధికం. ఎలక్టొరల్ బాండ్ల జారీకి ఎస్బిఐ ఒక్కటే అధీకృత బ్యాంకు. ఈ ఎలక్టొరల్ బాండ్లను ఎవరు కొనుగోలు చేసేది, వాటిని ఏ రాజకీయ పార్టీకి ఇస్తున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది.
ఆర్టిఐ కార్యకర్తకు ఇచ్చిన సమాధానంలో ఎస్బిఐ నుంచి ఈ బాండ్లను కొనుగోలు చేసిందెవరు? వాటిని నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఎస్బిఐ చెన్నై బ్రాంచిలో రూ.227 కోట్లు, కొల్కతా బ్రాంచిలో రూ. 154 కోట్లు, హైదరాబాద్ బ్రాంచిలో రూ.126 కోట్లు విలువైన ఎలక్టొరల్ బాండ్లు అమ్ముడయ్యాయని, వీటిలో ఎక్కువ బాండ్లు ఢిల్లీ బ్రాంచిలో రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయని మాత్రమే తెలిపింది.
బాండ్లు నగదుగా మార్చుకోవడంలో ఢిల్లీ తరువాత కొల్కతా బ్రాంచి (రూ.224 కోట్లు), చెన్నై బ్రాంచి (రూ.100 కోట్లు) ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్నది తక్కువే.. చండీగఢ్‌లో రూ. 50 లక్షలు, లక్నోలో రూ.3.21 కోట్లు, గోవాలో రూ. 90 లక్షలు మాత్రమే ఎన్‌క్యాష్ అయ్యాయి.
2018లో ఈ ఎలక్టొరల్ బాండ్ల స్కీము ప్రారంభించిన తరువాత ఎస్బిఐకి చెందిన 29 బ్రాంచీల నుంచి వివిధ వ్యక్తులు, కంపెనీలు 1,000, 10,000, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చాయి. ఇచ్చినవారి పేర్లను పుచ్చుకున్న రాజకీయ పార్టీలు బయటకు వెల్లడించరాదనేది ఎలక్టొరల్ బాండ్ల చట్టం నిబంధనల్లో ఒకటి.
2021 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి ఎన్నికల తరువాత అంటే ఆ సంవత్సరం జులైలో అమ్ముడు పోయిన ఎలక్టొరల్ బాండ్ల విలువ రూ. 150 కోట్లు , ఆ తరువాత రెండు మాసాలకు రూ. మరో రూ.614 కోట్లు విలువైన బాండ్లను ఎస్బిఐ విక్రయించింది.