కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమై, మంగళవారం కొన్ని చోట్ల హింసాత్మకంగా మారడంతో ఈ వివాదంకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, రెవెన్యూ మంత్రి ఆర్. అశోక ఆరోపించారు.
“కాంగ్రెస్ నాయకులు హిజాబ్ సమస్యకు సంబంధించి అగ్నికి ఆజ్యం పోస్తున్నారని వారు మండిపడ్డారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగితే కర్ణాటకలోని ప్రజలు వారిని అరేబియా సముద్రంలో పడవేస్తారని జ్ఞానేంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డి.కె. శివకుమార్ శివమొగ్గలో భారత త్రివర్ణ పతాకాన్ని దించారని, దాని స్థానంలో కాషాయ జెండాను పెట్టారని మీడియాకు తప్పుడు సమాచారం అందించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ బడితే అప్పుడు ఎగరవేయము. శివకుమార్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. సీనియర్ నేత నుంచి ఇలాంటి ప్రకటన రావడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అని మంత్రి మండిపడ్డారు. తరగతి గదులలో హిజాబ్ ధరింపరాదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినదని ఆయన చెప్పారు.
నిర్దేశిత యూనిఫాం కాకుండా ఇతర వస్త్రాలను నిషేధిస్తూ ఫిబ్రవరి 5 నాటి కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోందని, కోర్ట్ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఈ విషయమై ఎందుకు రసభ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
“పరిస్థితిని సమీక్షించడానికి మేము మంత్రులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించాము. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది ఫలితం కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటికే డ్రెస్ కోడ్‌పై సర్క్యులర్ జారీ చేశాం’ అని జ్ఞానేంద్ర వివరించారు. కరోనా కారణంగా ఇప్పటికే విలువైన రెండేళ్లను విద్యార్థులు కోల్పోయారని చెబుతూ, ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్న సమయంలో ఇటువంటి వివాదాలను రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇట్లా ఉండగా, కర్ణాటక హిజాబ్ వివాదంలో అరెస్టు అయిన నిరసనకారులు విద్యార్థులు కాదని వారు బయటి వ్యక్తులని రాష్ట్ర హోంశాఖమంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. బాగల్ కోట్ పట్టణంలో హిజాబ్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో శివమొగ్గలో 144 సెక్షన్ ను విధించామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా అవాంఛనీయమైన ఘటనలు జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, కర్ణాటకకు తాలిబాన్లమయం చేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం సహింపబోదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ హెచ్చరించారు. పాఠశాలలో హిజాబ్ వంటి వాటికి ఆస్కారం లేదని చెబుతూ విద్యార్థులు ఆయా పాఠశాలల నిబంధనలను అనురసింప వలసిందే అని స్పష్టం చేశారు.
విస్తృత ధర్మాసనానికి హిజాబ్
కర్ణాటకలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఉపశమనం లభించలేదు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వలేదు.
కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ బుధవారం ఇచ్చిన ఆదేశాల్లో ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించేందుకు అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను జారీ చేయడంపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
కాగా, రాష్ట్రంలో విద్యాసంస్థల ఎదుట రెండు వారాల పాటు నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా విద్యా సంస్థల నుండి 200 మీటర్ల పరిధి వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలను, మత సామరస్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజు బమ్మై మంగళవారమే ప్రకటించారు.