వారసత్వ రాజకీయాలు మన దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కొంతమంది సోషలిస్టులమని చెప్పుకునే ఫేక్ సమాజ్ వాదీలు ఉన్నారని, వాస్తవానికి వాళ్లు కుటుంబవాదులని ఆయన విమర్శించారు. గతంలో తనకు ఒక లేఖ వచ్చిందని, అందులో సమాజ్ వాదీ పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన 45 మంది వేర్వేరు పదవుల్లో ఉన్నారని వివరించారని అంటూ ములాయం, అఖిలేశ్ యాదవ్ రాజకీయాలపై ధ్వజమెత్తారు.
ఏదైనా ఒక పార్టీని కొన్ని తరాల పాటూ ఒకే కుటుంబం నడిపితే అక్కడ దేశం అభివృద్ధి కాకుండా కుటుంబ అభివృద్ధే లక్ష్యంగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ లో రెండు పార్టీలను రెండు కుటుంబాలు మాత్రమే నడుపుతూ వచ్చాయని, ఇదే ట్రెండ్ హర్యానా, జార్ఖండ్, యూపీ, తమిళనాడు వరకూ చాలా రాష్ట్రాల్లో కనిపిస్తోందని ఆయన వివరించారు.
వారసత్వ రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం ఎప్పటికీ సుప్రీం పవర్ గా ఉంటుందని ప్రధాని చెప్పారు. పార్టీ మంచిగా ఉందా? లేదా? అన్నదిగానీ, దేశం మంచిగా ఉందా? లేదా? అన్నది గానీ వారికి అక్కర్లేదని, తమ కుటుంబానికి చెందిన వాడే పార్టీ చీఫ్ గా ఉన్నాడా లేదా అన్నది ఒక్కటే చూసుకుంటారని స్పష్టం చేశారు.
ఫేక్ సోషలిజం గురించి మాట్లాడాల్సి వస్తే అది కచ్చితంగా కుటుంబ రాజకీయాల ప్రస్తావనే అవుతుందని చెప్పారు. రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్ లాంటి వాళ్ల కుటుంబాలను చూస్తే నిజమైన సోషలిజం అంటే ఏంటో తెలుస్తుందని హితవు చెప్పారు. వాళ్లు నిజమైన సోషలిస్టులని పేర్కొన్నారు.