దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. తనను జైల్లో వేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తరచూ పేర్కొంటుండడం పట్ల తీవ్రంగా స్పందించారు. బండిసంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
జైలు అంటే దొంగలు భయమని, తమకేం భయలేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వరుసగా మూడు రోజులుగా అవినీతి ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి మోదీ ప్రభుత్వ హయాంలో 33 మంది బ్యాంక్‌లను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత అని ఎద్దేవా చేశారు.
ఇందులో సగం కంటే ఎక్కువ మంది మోదీకి స్నేహితులేనని, గుజరాతిలేనని కేసీఆర్ ఆరోపించారు. “బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ది కంట్రీ” నినాదం ఇప్పుడు అవసరమని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ. ప్రధాని మోదీ. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీకి ప్రజల్లో నమ్మకం ఉండేది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, రాష్ట్రాల్లో గెలవకపోయినా అధికారం చేలాయిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయాలపై చర్చ పెడదాం.’’ అని సీఎం కేసీఆర్ సవాల్ చేసారు.
రఫెల్ డీల్ లో మోడీ ప్రభుత్వం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. బీజేపీ అవినీతి కుంభ స్థలాన్ని బద్ధలు కొడతామని వెల్లడించారు. రఫెల్ డీల్ పై సుప్రీం కోర్టులో తాము పిటిషన్ వేస్తామని ప్రకటించారు. వీటన్నిటి మీద ఢిల్లీలో పంచాయతీ పెడతానని స్పష్టం చేశారు.
మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ కేంద్రం అమ్ముతోందని ధ్వజమెత్తుతూ ప్రభుత్వ రంగాన్నంతటినీ గుజరాత్‌కు చెందిన అదానికో, అంబానికో అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. సుదీర్ఘ చరిత్ర వున్న భారతీయ రైల్వేలను ముక్కలు చెక్కలుగా చేసి ప్రైవేటు యాజమాన్యాల జేబుల్లో కుక్కడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ధ్వజమెత్తారు. పేద, మధ్య తరగతి ప్రజానీకం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎల్ఐసి (జీవిత బీమా)ని ప్రైవేటుపరం చేయబోతున్నారని హెచ్చరించారు.
పేరుకు విద్యుత్ సంస్కరణలు.. చేసేది ప్రైవేటీకరణ అని పేర్కొన్నారు. విద్యుత్ ను పూర్గిగా కొర్పొరేటైజ్ చేయడమే కేంద్రం టార్గెట్ అని విమర్శించారు. బీజేపీ పరిపాలనలో మొత్తం దేశం నాశనమైందని చెబుతూ నిరుద్యోగ యువత రేటు పెరిగిందని చెప్పారు. తెలంగాణలో 0.3 శాతం ఉంటే దేశంలో 7 శాతానికి పైగా ఉందని గుర్తు చేసారు.
దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపేనని అంటూ దేశంలో 77 శాతం సంపద కేవలం 10 శాతం మంది చేతుల్లోనే ఉందని చెప్పారు. బయట దేశం పరువు పోతోందని, పారిశ్రామిక అభివృద్ధి డిసెంబర్ లో 0.4 శాతానికి పడిపోయిందని తెలిపారు.
ప్రధాని మోదీ చెప్పేది ఒకటి..చేసేదొకటని అంటూ విద్యుత్ ను రూ.1.10 పైసలకు యూనిట్ ఇస్తున్నట్లు గజ్వేల్ లో మిషన్ భగీరథ ప్రారంభ సభలో చెప్పారని గుర్తు చేశారు. కానీ అసలు దేశంలోనే రూ.1. 10 పైసలకు యూనిట్ ఎక్కడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కళ్ల ముందు ఇన్ని కనిపిస్తున్నా.. మోడీ అబద్ధాలు చెబుతున్నారన్నారని విస్మయం వ్యక్తం చేశారు.
కేంద్ర పవర్ పాలసీ వల్ల 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా విద్యుత్ ఉత్పత్తి కావడం లేదని పేర్కొన్నారు. బీజేపీకి డబ్బులిచ్చే సంస్థలకు విద్యుత్ ప్రాజెక్టులు అప్పజెప్పాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను బంద్ పెట్టయినా సరే.. వాళ్లు తెచ్చే సొలార్ పవర్ ను కొనాలని కేంద్రం నిబంధనలు పెట్టారని, సొలార్ పవర్ కొనకపోతే ఫైన్లు విధిస్తామన్నారని విమర్శించారు.
వ్యవసాయ రంగంలో మీటర్లు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ముసాయిదా ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేశామని చెబుతూ మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడమీద కత్తి పెట్టారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులు పాటిస్తోందని, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 25 వేల మీటర్లు పెట్టారని తెలిపారు.