పుల్వామా ఉగ్రదాడికి సమాధానంగా భారత్ సేనలు జరిపిన లక్షిత దాడుల పట్ల తనకు కూడా అనుమానాలున్నాయని, వీటిపై కేంద్రం వివరణ ఇవ్వాలని అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన ప్రకటన పట్ల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాఖ్యలు అమర సైనికుల త్యాగాలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు.
పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన సమయంలో లక్షిత దాడుల గురించి ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు నాడు అమరులైన సైనికులను అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గాంధీ కుటుంబానికి తమ విధేయతను చాటుకోవడంలో కాంగ్రెస్ తో సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము దేశం పట్ల విధేయతతో ఉంటామని, మన సైనిక బలగాలను ప్రశ్నించే వాళ్లను వదలబోమని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు సంబంధించిన వీడియోను మీడియా సమావేశంలో విడుదల చేస్తూ ధైర్యసాహసాలుగల మన సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో గ్రాఫిక్ సాక్ష్యాధారాలు ఇవిగో చూడండి అని కేసీఆర్‌ను ఉద్దేశించి చెప్పారు.
‘‘ప్రియమైన కేసీఆర్ గారూ, ధైర్యసాహసాలుగల మన సైన్యం నిర్వహించిన లక్షిత దాడుల వీడియోగ్రాఫిక్ సాక్ష్యం ఇదిగో. ఇది ఉన్నప్పటికీ మీరు మన సాయుధ దళాల సత్తాను ప్రశ్నిస్తున్నారు, వారిని అవమానిస్తున్నారు. మన సైన్యాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి, మన సైన్యంపై దాడి చేయడానికి మీకెందుకంత తెగింపు? మన సైన్యాన్ని అవమానించడాన్ని నవ భారతం సహించబోదు’’ అని ఓ ట్వీట్లో స్పష్టం చేశారు.
దీనితోపాటు ఓ వీడియోను జత చేశారు. ఈ వీడియోలో మ్యాపుల స్క్రీన్‌షాట్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వివిధ వీడియోల్లోని కట్ షాట్స్ ఉన్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదివారం మాట్లాడుతూ, నేటికీ తాను రుజువు అడుగుతున్నానని చెప్పారు. భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్‌కు రుజువు చూపించాలని స్పష్టం చేశా రు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, అందుకే ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.