ప్రత్యేక హౌదా కోసం వైసిపి ఎంపీలు రాజీనామాలు చేస్తామని ఆనాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. టిడిపి కార్యాలయంలో నిర్వహించిన వ్యూహకమిటీ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. హౌదా సాధనకై యుద్ధం చేయకుండా ఎందుకు వెనుదిరుగుతున్నారని సిఎం జగన్ ని నిలదీశారు. సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అంటూ ప్రశ్నించారు.
ప్రజలు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు పదేపదే చెప్పారని, ఇప్పుడెందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్జించి, ఇప్పుడు కుక్కిన పేనులా ఉండటం దేనికి సంకేతమని మండిపడ్డారు.
త్రిసభ్య కమిటీ ఎజెండాలో ప్రత్యేకహౌదా అంశాన్ని చేర్చినప్పుడు అది తమ ఘనతని చెప్పుకున్న వైసిపి నేతలు, తొలగించాక టిడిపిపై బురద జల్లడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల కంటే వెనుకబడిపోయిందని ఎద్దేవా చేసారు.
విద్యుత్ మోటార్లకు మీటర్ల అమర్చడాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై టిడిపి పోరాడుతుందని తెలిపారు. సినీపరిశ్రమకు లేని సమస్యలను సృష్టించారని ఆరోపించారు. చిరంజీవిలాంటి వారు సిఎం జగన్ ను అంతలా ప్రాధేయపడలా అని ప్రశ్నించారు.
స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్‌ని ప్రాధేయపడాలా? అని నిలదీసేరు. తెలుగు సినిమా పరిశ్రమని జగన్‌రెడ్డి కించపరిచారని దుయ్యబట్టారు, ప్రభాస్, రాజమౌళి, మహేశ్ బాబు వంటి వారిని పిలిచి వారిని కించపర్చేలా వ్యవహరిస్తారా?’ అని చంద్రబాబు మండిపడ్డారు.
‘‘ఈ రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 112 సార్లు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది. 193 సార్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ తీసుకొన్నారు. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. పాఠశాలలను విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పేద వర్గాల పిల్లలకు పెద్ద దెబ్బ. ఎస్సీ బీసీ కాలనీల్లో ఉన్న పాఠశాలలను రద్దు చేసి ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల 3, 4, 5 తరగతుల విద్యార్థులు కనీసం 3 కిలోమీటర్ల నడిచి వెళ్లాల్సి వస్తుంది. చిన్న పిల్లలు అంత దూరం నడవలేక చదువు మావేసే ప్రమాదం ఉంది”అని చంద్రబాబు హెచ్చరించారు.