దేశంలో గుణాత్మక అభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పిలుపిచ్చారు. ప్రాంతీయ పార్టీలు అన్ని కలసి అటువంటి వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయమై త్వరలో ప్రాంతీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఏ రంగంలో కూడా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేక పోయామని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాలే ఇందుకు కారణమని చెబుతూ దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసనుమైందని వారిద్దరూ పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ దాడులకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో కెసిఆర్ ఆదివారం ముంబయిలో మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతం, భాష, దేశభక్తి ముసుగులో చేస్తోన్న అరాచకాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని కెసిఆర్ చెప్పారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపునకు వాటిని ఉపయోగిస్తోందని, రాష్ట్రాల పట్ల పక్షపాత వైఖరి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు.
పద్ధతి మార్చుకోకుంటే బిజెపికి ఇబ్బందులు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు. ఈ దుష్ట పరంపరను అడ్డుకోకుంటే దేశానికి ప్రమాదమని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో బిజెపి అనుసరించిన అప్రజాస్వామిక, అనైతిక చర్యలను ఉద్దవ్ ఠాక్రే ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విభజన శక్తుల నుంచి దేశాన్నీ కాపాడేందుకు కెసిఆర్ చేస్తోనాని, ఆయన కృషికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇతర అంశాలపై చర్చించేందుకు మహారాష్ట్ర సిఎంను కెసిఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రుల మీడియా సమావేశంలో మాట్లాడారు.
దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, జాతీయ స్థాయిలో జరగాల్సిన మార్పులపై చర్చించామని కెసిఆర్ తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసనుమైందని చెప్పారు. ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు ఆరంభం మాత్రమేనని, మున్ముందు పురోగతి వస్తుందని పేర్కొన్నారు.
త్వరలోనే అనిు ప్రాంతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రత్యామ్న్యాయ రాజకీయ వేదికకు సంబంధించి అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని, రాబోయే రోజుల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో లేదా మరో చోట ప్రాంతీయ పార్టీల నేతలందరంతో కలిసి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని పేర్కొన్నారు.
మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ తమ రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ మంచి బంధం ఉంటుందని, ఇదే బంధానిు దేశాన్ని ఏకం చేయడం కోసం ఉపయోగిస్తామని తెలిపారు. దేశ హితం కోసం కెసిఆర్‌తో కలిసి నడుస్తామని చెప్పారు. తమతో కలిసి వచ్చే నేతలతో కలిసి విధానపరమైన మార్పుల కోసం పోరాడుతామని వెల్లడించారు.
కేసీఆర్ ప్రయత్నాలకు పవార్ మద్దతు
మహారాష్ట్ర సిఎంతో సమావేశం అనంతరం కెసిఆర్ బృందం ఎన్‌సిపి అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌తో సౌత్ ముంబయిలోని ఆయన నివాసం సిల్వర్ ఓక్స్‌లో భేటీ అయింది. తాజా జాతీయ రాజకీయాలు, బిజెపి విధానాలపై పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కెసిఆర్ ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రారంభించాల్సిన కార్యాచరణను కెసిఆర్‌కు పవార్ వివరించారు. కెసిఆర్ ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో పవార్ కుమార్తె సుప్రియా సులే కూడా అక్కడే ఉన్నారు.
బిజెపి చివరకు వ్యవసాయ రంగాన్ని, రైతులను కూడా వదల్లేదని పవార్ విచారం వ్యక్తం చేశారు. సమావేశానంతరం ఇరువురు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని పవార్ తెలిపారు. కెసిఆర్ బృందంలో ఎంపీ సంతోష్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు.