మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ రెండు రోజుల క్రితం కలవడం ఏపీలోని అధికార పక్షంలో దుమారం రేపుతున్నది. రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసంలో ఇరువురి మధ్య సుమారు గంటసేపు సమావేశం జరిగింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.
షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి కావడం, అరుణ్ కుమార్ వై ఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు కావడం గమనార్హం. కొంత కాలంగా కుటుంభం కలహాల కారణంగా జగన్, షర్మిల ఎడమొఖం, పెడమొఖంగా ఉంటూ వస్తున్నారు. ఆమె తెలంగాణాలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు జగన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు.
పైగా ఆమె 2014లోనే కాపాడ నుండి లోక్ సభకు పోటీచేయాలి అనుకొంటే, ఆ సీట్ బాబాయి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చి, తల్లి వైఎస్ విజయలక్ష్మిని విశాఖపట్నం నుండి అభ్యర్థిగా నిలబెట్టడం, ఆమె ఓటమి చెందడం జరిగింది. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ఆయన ప్రారంభించిన పాదయాత్రను కొనసాగించి, తల్లితో కలసి పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు.
అయితే అధికారంలోకి వచ్చాక తల్లి, చెల్లెలును జగన్ రాజకీయంగా దూరంగా ఉంచడం, గతంలో ఎన్నడూ రాజకీయాలలో జోక్యం చేసుకొని భార్య భారతి తెరవెనుక నుండి క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంలో వారి కుటుంభంలో పరిస్థితులు సవ్యంగా లేవని భావిస్తున్నారు.
మరోవంక, అరుణ్ కుమార్ సహితం జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి అధికారికంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. పలు సందర్భాలలో జగన్ పాలనపై, రాజకీయాలపై తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జగన్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టాలని కొన్ని వర్గాల నుండి షర్మిలపై వత్తిడి వస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇటువంటి సమయంలో అరుణ్ కుమార్ తో అనిల్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తున్నది. ఈ విషయమై అడగగా, “మా రహస్యాలు మాకుంటాయి. ఆ అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి” అంటూ మీడియాతో నర్మగర్భంగా పేర్కొనడం గమనార్హం.
తెలుగురాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై అరుణ్‌కుమార్‌తో చర్చించినట్లు బ్రదర్ అనిల్ తెలిపారు. తనకు రాజకీయాలు తెలియవని, వాటి గురించి కొంచెం నేర్చుకోవడానికి వచ్చినట్లు చెప్పారు. మరోవంక, పాత పరిచయాలతో అన్ని విషయాలూ మాట్లాడుకున్నామని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు.