ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు క్రమంగా అధికార పార్టీకి ఆందోళనకర పరిణామాలకు దారితీస్తుంది. ఈ కేసులో కీలక నిందితుడు ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మరో బాబాయ్ కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ స్వయంగా వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత ఆరోపణ చేస్తుండడంతో సిబిఐ దర్యాప్తు మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది.
2020లోనే సిబిఐకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె స్పష్టం చేసిన అంశాన్ని ఇప్పుడే సిబిఐ బహిరంగ పరచడం గమనిస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలువురు ఆరోపిస్తున్నారు. మరోవంక, ఇదే విషయమై సునీత నేరుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ వ్రాసారు.
తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్‌ను సునీత కోరారు. సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని లేఖకు జతపరిచారు. అలాగే సీబీఐకి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‌కు వైఎస్ సునీత అందజేశారు.
2020 జూలై 7న సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె జగన్ సహితం అవినాష్ ను కాపాడటంకోసం ఏ విధంగా ప్రయత్నం చేశారో వివరించారు. ‘మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్)ను కోరా.. అనుమానితుల పేర్లు కూడా చెప్పా’ అని అప్పుడు ఆమె సిసిఐకు చెప్పారు.
అయితే, `వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్ చేశా.. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది.. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడైపన్నెండు కేసులు అవుతాయ్’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడడం నాకు బాధించింది’ అంటూ ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
అనుమానితుల జాబితాలో.. ఈసీ గంగిరెడ్డి (జగన్ భ్యా భారతి తండ్రి) ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్ కోప్పడ్డారని ఆమె వాపోయారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా ఎవరో కాంపౌండర్ ఎక్కువయ్యారని.. తన తండ్రి మరణ వార్తతో సంబరాలు చేసుకోవడానికి బాణసంచా కొనుగోలుకు యత్నించిన వ్యక్తిని ఎలా వదిలి పెట్టారో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
దీంతో తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. రాజకీయంగా తన తండ్రి వివేకాపై కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కక్ష పెంచుకున్నారని ఆమె ఆరోపించారు. హత్య జరిగిన రోజు కూడా నాన్న మరణించారని మొదట భారతికి, తర్వాత జగన్‌కు ఫోన్ చేసి చెబితే.. అవునా అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, ఆశ్చర్యం, బాధలాంటివి కొంతైనా వారిలో కనిపించలేదని ఆమె తెలిపారు.