పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాలన చేతకానివాడే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
సమర్ధ నాయకుడు అభివృద్ది చేస్తాడని, అయితే వైసీపీ వాళ్లు తనకు కులం అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. . ఉమ్మడి రాష్ట్రంలో హైదాబాద్ ఐటి నగరంగా అభివృద్ది చేశా. అక్కడ తన కులం వాళ్లున్నారని అభివృద్ది చేశానా? అని ప్రశ్నించారు. తనకు కులం లేదు, మతం లేదని అంటూ తన కులం, మతం తెలుగు జాతే. తెలుగు వారంతా తన కుటుంబ సభ్యులే అని ప్రశ్నించారు.
తెలుగు జాతిని ప్రపంచలో నెం.1 గా చేయాలన్నదే తన తపన అని తెలిపారు. భవిష్యత్తు టెక్నాలజీదే అన్న భావనతో నాడే ఐటీకి శ్రీకారం చుట్టానని చెబుతూ ఐటీ అంటే దేశంలో మొదట గుర్తొచ్చేది హైదరాబాదే అని స్పష్టం చేశారు. హైటెక్ సిటీని 14 నెలల్లో పూర్తి చేశాం. ప్రపంచమంతా తిరిగి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. బిల్ గేట్ ను రాష్ట్రానికి తీసుకొచ్చి కంపెనీలు పెట్టించామని గుర్తు చేశారు.
దాని ఫలితంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరిలో ఐటి ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 25 ఇంజనీరింగ్ కాలేజీలను 250 కాలేజీలుగా చేశామని అంటూ నాడు ఐటిని ప్రోత్సహించటం వల్లే నేడు ఎక్కువ మంది యువత ఐటి రంగంలో స్ధిరపడ్డారని తెలిపారు.
నేడు పోన్ అనే ఆయుధం ద్వారా టెక్నాలజీని ఉపయోగించి మన ఆలోచనల్ని ప్రపంచంతో పంచుకోవటం నిమిషం పని అని పేర్కొంటూ టెక్నాలజిని ఉపయోగించుకుని ఐటీడీపీ కార్యకర్తలు వైసీపీ పాలన వైఫల్యాలు, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని మీడియా చానళ్లు లాలూచీ పడి ప్రసారం చేయలేదని విస్మయం వ్యక్తం చేశారు.
అయినా ప్రజలకు తెలియకుండా ఆగిందా? ఐటీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా జగన్ రెడ్డికి కోర్టు పెట్టిన చివాట్లు ప్రజల్లోకి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. కొంతమంది మీడియాను వ్యాపారంగా మర్చారని విమర్శించారు. రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడినా టీడీపీ హయాంలో ప్రజలకు ఏ లోటు లోకుండా పాలన చేశామని, పెట్టుబడులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేశాముని పేర్కొన్నారు.
పోలవరాన్ని సోమవరంగా మార్చి 72 శాతం పనులు పూర్తి చేశామని, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ నాటికి పూర్తయ్యేదని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరంలో అవినీతి జరిగిందని జగన్ రెడ్డి, బ్లూ మీడియా, పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేశారని చెబుతూ కానీ పైసా అవినీతిని నిరూపించారా? అని ప్రశ్నించారు.
“సొంత బాబాయిని చంపి మొదట గుండెపోటన్నారు, తర్వాత నాపై, టీడీపీ పై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబాయిని చంపిందెవరో బయటపటంతో ఏకంగా సీబీఐపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో రూ. 40 కోట్లు సుపారీ ఇచ్చేంత డబ్బు ఎవరి దగ్గర ఉందో రాష్ట్ర ప్రజలకు తెలియదా?. సొంత బాబాయిని క్రూరంగా చంపుకున్నారంటే వాళ్లను ఏమనాలి? బాబాయిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా?” అంటూ ప్రశ్నించారు.
వైసీపీ అంటేనే అబద్దాల పుట్ట, అవినీతికి అడ్డా అని ధ్వజమెత్తుతూ గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయించి గెలిచారని ఆరోపించారు. ఐటీడీపీ కార్యకర్తలు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపిచ్చారు.
జగన్ రెడ్డి….విద్యార్ధులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజల్ని దగా చేశారని, వ్యవ్యస్ధలన్నింటిని ధ్వంసం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో తప్పు చేయాలంటేనే భయపడేవారని, కానీ నేడు వ్యవస్ధలన్నింటిని విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలపై, కార్యకర్తలపై, ఐటీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని అంటూ వారు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించకూడదా? అని ప్రశ్నించారు.
పోలీసులు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అధికారులు చట్టాన్ని కాపాడితే అండగా ఉంటాం, కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉంది. వైసీపీ వైఫల్యాల్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతూ అక్రమ కేసులకు భయపడొద్దని చెప్పారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఎత్తేస్తామని భరోసా ఇచ్చారు.