అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుపు 2024 ఎన్నికలలో తిరిగి గెలుపు ప్రజల సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడాన్ని తొందరపాటు అంటూ ప్రతిపక్ష నేతలు చురకలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫలితాలతో సంబంధం లేకుండా 2024లో పోరుకు సిద్దమే అంటూ మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ కిషోర్, సంజయ్ రౌత్ వంటి వారు ప్రకటనలు చేశారు.
అయితే, ఒక విధంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా ఎవ్వరికీ వారుగా సొంతంగా కూటమి ఏర్పాటు చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు గండి పడినట్లయింది. ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నాలు చేస్తున్న మమతా బెనర్జీ, కేసీర్ వంటి నేతలలో మార్పు కనిపిస్తున్నది. ఈ ఫలితాలపై ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదు. మమతా బనెర్జీ మాత్రం కాంగ్రెస్ కలసి వస్తే, ఆ పార్టీతో కలసి 2024లో పోరాడటానికి సిద్దమే అని ప్రకటించారు.
గత ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో వరుసగా మూడోసారి గెలుపొందిన తర్వాత ఆమె కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఫలితాలు 2024లో వచ్చే ప్రజా తీర్పుకు సూచిక అంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వాఖ్య పట్ల ఆమె పూర్తిగా విభేదిస్తున్నారు. 2022 ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నడం ఆచరణలో సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.
కాగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఎలాంటి దూకుడు పనికిరాదని, బీ పాజిటివ్ గా ఉండాలని అంటూ బీజేపీయేతర పక్షాలకు మమతా హితవు చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలనుకునే రాజకీయ పార్టీలన్నీ కలిసి నడవాలని ఆమె స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ తమ విశ్వసనీయతను కోల్పోతోందని పేర్కొంటూ కాంగ్రెస్‌పైన ఆధారపడలేమని తేల్చి చెప్పారు.
2024లో సంగ్రామం తప్పదు
మరోవంక, ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా తిప్పికొట్టారు. భారత దేశం కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుందని, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు భవిష్యత్తును నిర్ణయించలేవని అంటూ ఓ ట్వీట్ చేశారు.
రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఉండబోదని తెలిపారు. అయ్యగారికి ఈ విషయం తెలుసని అంటూ అందుకే ఆయన తెలివైన ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
‘‘భారత దేశం కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుంది, నిర్ణయమవుతుంది, అంతేకానీ ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ కాదు. అయ్య గారికి ఈ విషయం తెలుసు. అందుకే ప్రతిపక్షంపై నిర్ణయాత్మక మానసిక సానుకూలత, పైచేయి సాధించడానికి రాష్ట్ర ఎన్నికల ఫలితాల చుట్టూ వెర్రిని సృష్టించే తెలివైన ప్రయత్నం. ఈ తప్పుడు కథనం ఉచ్చులో పడొద్దు, దానిలో భాగం కావొద్దు’’ అని తెలిపారు.
మాయావతి, ఒవైసీలకు పద్మా అవార్డులు
ఇలా ఉండగా, ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పరోక్షంగా దోహదపడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషణ్, భారత రత్న పురస్కారాలను ఇవ్వాలని శివసేన ఎద్దేవా చేసింది.
బీజేపీ ఘన విజయం సాధించిందని చెబుతూ ఉత్తర ప్రదేశ్ వారి సొంత రాష్ట్రమని, (ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ అని), అయినప్పటికీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి ఈ ఎన్నికల్లో 125 స్థానాలు వచ్చాయని, అంటే అంతకుముందు కన్నా మూడు రెట్లు పెరిగాయనిన ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ చెప్పారు. అంతకుముందు 42 స్థానాలున్న పార్టీ ఇప్పుడు 125 స్థానాలను సాధించిందని గుర్తు చేశారు.
బీజేపీ విజయానికి మాయావతి, ఒవైసీ దోహదపడ్డారని అంటూ వారికి పద్మవిభూషణ్, భారత రత్న పురస్కారాలను ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయం గురించి మాట్లాడుతూ, దీని గురించి తాము తలక్రిందులు కావలసినదేమీ లేదని పేర్కొన్నారు. వారి సంతోషాన్ని తాము కూడా పంచుకుంటామని చెప్పారు.
అయితే, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పరాజితులయ్యారని అడిగారు. పంజాబ్‌లో బీజేపీని పూర్తిగా తిరస్కరించారని చెబుతూ జాతీయ పార్టీ అయిన బీజేపీని పంజాబ్‌లో తిరస్కరించడం చాలా బాధాకరమని తెలిపారు.