వైసిపి వ్యతిరేక ఓట్ చీలకుండా ఏపీలో కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ 9వ ఆవిర్భావ దినం సందర్భంగా మంగళగిరి సమీపంలో జరిపిన భారీ బహిరంగ సభలో వెల్లడించడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్నది. ముఖ్యంగా అధికార పక్షంలో ఒకవిధమైన ప్రకంపనలు రేపుతున్నట్లు కనిపిస్తున్నది. గత రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీ లాబీలలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్యెల్యేలు ఈ విషయం గురించే మాట్లాడుకోంటుకోవడం కనిపిస్తున్నది.
శాసనమండలి వద్ద ఎదురు పడిన ఇద్దరు బిజెపి సభ్యులను కొందరు మంత్రులు ఈ విషయమై ఆరా కూడా తీశారు. మరోవంక, టిడిపి, బిజెపి తిరిగి కలవబోతున్నట్లు పవన్ కళ్యాణ్ సంకేతం ఇవ్వడంతో వైసిపి నేతలతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు కూడా పవన్ పై విరుచుకు పడ్డారు. ఆ రెండు పార్టీల చేతులలో `ఆటబొమ్మగా’ మారాదంటూ విమర్శలు కురిపించారు.
అయితే ఈ ప్రకటనపై టిడిపి, బిజెపి నేతలు మాత్రం మౌనం పాటించడం గమనార్హం. `మా పార్టీల పొత్తుల గురించి ఇతరులకు ఎందుకు?’ అంటూ ఒక టిడిపి నేత స్పందించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే పొత్తుల విషయమై పవన్ బిజెపి కేంద్ర నాయకులతో చర్చిస్తారని, ఆ విషయం వారు చూస్తూ కొంటారని దాటవేశారు.
2019 ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన భారీ రాజకీయ సమావేశం ఇదే కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ వెనుక బలమైన పార్టీ యంత్రాంగం లేకపోయినా, జిల్లాల్లో బలమైన నాయకులు లేకపోయినా, చెప్పుకోదగిన ఆర్ధిక వనరులు లేకపోయినా జనంలో వస్తున్న స్పందన రాజకీయ వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులకు నాంది అవుతుందని వైసీపీ `తిరుగుబాటు’ ఎంపీ రఘురామ కృష్ణరాజు జోస్యం చెప్పారు. పవన్ విజన్ చాలా స్పష్టంగా ఉందని పేర్కొంటూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని అన్నారని.. ఆయన మాటల ప్రకారం బీజేపీ, తెలుగుదేశం, ఇతర పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లోకి వెళ్తారని తనకు అర్థమైందని చెప్పారు.
అయితే వైసీపీ, జనసేన పార్టీలు ఎట్టి పరిస్థితులలో కలవబోవని ఆయన స్పష్టం చేశారు. పవన్ సభలో పెయిడ్ ఆర్టిస్టులు లేరని, అదే తమ పార్టీ సభలు పెడితే రెండు రోజుల ముందు నుంచే డ్వాక్రా మహిళలకు సందేశాలు వెళ్తాయని అధికార పక్షం గురించి ఎద్దేవా చేశారు.
కానీ జనసేన సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారని తెలిపారు. పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్ కోసం వేచిచూస్తున్నామని, దాని వెనుక చాలా అర్థాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల చాలా కష్టపడ్డారని, తమ పార్టీ విజయం వెనుక వారి పాత్ర చాలా ఉందని చెబుతూ పరోక్షంగా ఇప్పుడు వారిద్దరూ జగన్ కు వ్యతిరేకంగా పావులు కదపడాన్ని గుర్తు చేశారు.