పంజాబ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆప్ వెంటనే రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలలో రాష్ట్రం నుండి తమ అభ్యర్థులుగా ఎంపిక చేసిన ఐదుగురి గురించి ఆ పార్టీలోనే కలకలం చెలరేగుతుంది. వారిలో ఒకరిద్దరు మినహా అసలు పార్టీకి సంబంధం లేనివారు కావడం, పంజాబ్ తో ఏమాత్రం సంబంధం లేనివారు కావడంతో వారిని ఏ ప్రాతిపదికపై ఎంపిక చేశారన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఈ నెల 31 జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులుగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్, ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దా, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాను ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది.
ఈ ఐదుగురు అభ్యర్థులు సోమవారం పంజాబ్ శాసనసభ సముదాయంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిలో కేవలం హర్భజన్ సింగ్ మాత్రమే పంజాబ్ కు చెందిన వారు. ఆయనకు కూడా పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలల్లో మొత్తం 117 స్థానాలలో 92 స్థానాలను ఆప్ కైవసం చేసుకోవడంతో రాజ్యసభ సభ్యులుగా ఈ ఐదుగురి ఎన్నిక లాంఛనప్రాయమే.
ఆప్ నామినేట్ చేసిన ఐదుగురు అభ్యర్థుల్లో.. నలుగురు ఢిల్లీలో రిమోట్ కంట్రోల్‌కి కోత్త బ్యాటరీలని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ఎద్దేవా చేశారు. పంజాబీయేతరులు, బయటి వ్యక్తులను.. రాజ్యసభకు నామినేట్ చేసి పంజాబ్ ప్రజలను మోసం చేశారని ఆప్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుని పంజాబ్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నారని సిద్దూ ఆరోపించారు. వారిని ఎంపిక చేయడం పంజాబ్ ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు.