కర్ణాటకలోని స్థానిక వార్షిక ఉత్సవాల సమయంలో ముస్లింలు దుకాణాలను ఏర్పాటు చేయకుండా ఆలయ అధికారులు నిషేధం విధించారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఈ నెల 15న కర్ణాటక హైకోర్టు సమర్థించిన సంగతి విదితమే. కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన ముస్లిం వ్యాపారవేత్తలు తమ దుకాణాలకు తాళాలు వేశారు.
దానిపై ఆగ్రహం చెందిన పలు దేవాలయాల పాలకవర్గాలు ఇప్పుడు ఉత్సవాల్లో దుకాణాల ఏర్పాటుపై నిషేధం విధించాయి. ఈ ఉత్సవాల సమయంలోనే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుండగా ముస్లిం వ్యాపారులపై వేటు వేయడంతో, వారికి తీవ్ర నష్టం చేకూరనుంది.
కాగా, దీనిపై వివరణ కోరుతూ పోలీసులను నివేదికలివ్వాలని రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ‘దేవాలయాల వద్ద ముస్లిం వ్యాపారస్తులు… స్టాళ్లను ఏర్పాటు చేసుకోనివ్వకుండా.. పలు హిందూత్వ సంస్థలు అడ్డుకున్నాయని మీడియాలో కథనాలు రావడం చూశానని చెప్పారు.
ఈ నెల 31న మహాలింగేశ్వర ఆలయంలో జరిగే ఉత్సవాలకు నిర్వహించే వేలంలో పాల్గనేందుకు కేవలం హిందువులు మాత్రమే అర్హులని ఆహ్వాన పత్రికలో నిర్వాహకులు పేర్కొన్నారు. ఉడిపి జిల్లాలోని కాప్‌లో… హోసా మారిగుడి దేవాలయం మేనేజింగ్ కమిటీ సైతం.. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే జాతరలో భాగంగా… ఈ నెల 18న నిర్వహించే వేలంలో ముస్లింలకు స్టాల్స్‌ను కేటాయించలేదు.
సుమారు 100 స్టాళ్లను వేలం వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వేలంలో కేవలం హిందువులకు మాత్రమే అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ కమిటీ హెడ్ రమేష్ హెగ్డే ఓ సమావేశంలో తీర్మానం చేశారని సమాచారం. ఈ విషయంపై రమేష్ మాట్లాడుతూ హిజాబ్ వివాదంపై హైకోర్టు ఉత్తర్వులను గౌరవించని ముస్లిం వ్యాపారస్తులకు, స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వకూడదంటూ హిందూత్వ సంస్థలు కోరినట్లు తెలిపారు.
వారికి అనుమతిన్వికూడదంటూ స్థానిక కాప్ సభ్యులు కాప్ టౌన్ మున్సిపాలిటీ అధికారికి లేఖలు రాసినట్లు హిందూ జాగరణ్ వేదిక (హెచ్జెవి) మంగళూరు డివిజనల్ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ తెలిపారు. అదేవిధంగా శివమొగ్గలో సైతం… కోటి మారికాంబ ఉత్సవాల్లో కూడా ముస్లిం వ్యాపారస్తుల దుకాణాలకు అనుమతినివ్వలేదని తెలుస్తోంది.
దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ దేవాలయ ఉత్సవాల్లో కూడా వీరూ వ్యాపారం చేసేందుకు నిరాకరిస్తూ.. హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు మంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు.