కరోనా మహమ్మారి విజృంభించిన దరిమిలా పాఠశాలల్లో నిలిపివేసిన మధాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
లోక్సభ జీరో అవర్లో సోనియా గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మూడేళ్ల లోపు పిల్లలతోపాటు గర్భిణి మహిళలకు, బిడ్డలకు పాలిచ్చే తల్లులకు వేడిగా ఆహారాన్ని అందచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ కారణంగా అన్నిటి కన్నా ముందుగా పాఠశాలలు మూతపడ్డాయని, అన్నిటి కన్నా ఆలస్యంగా తెరుచుకున్నవి కూడా పాఠశాలలేనని ఆమె తెలిపారు.
భావి భారత పౌరులు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. పాఠశాలలు మూతపడిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం కూడా నిలిచిపోయిందని, జాతీయ ఆహార భద్రతా చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే ప్రజలకు ఉచితంగా రేషన్ లభించిందని సోనియా తెలిపారు.
అయితే పిల్లలకు ఉడికించిన, పౌష్ఠికాహారానికి రేషన్ ప్రత్యామ్నాయం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ పాఠశాలలు తెరచినందున పిల్లలకు పౌష్ఠికాహారం అందచేయవలసిన అవసరం ఉందని ఆమె చెప్పారు. కరోనా కారణంగా మధ్యలోనే చదువులు మానేసిన పిల్లలను తిరిగి స్కూళ్లకు రప్పించడానికి మధ్యాహ్న భోజనం ఉపయోగపడగలదని ఆమె తెలిపారు.
ఇలా ఉండగా, గతంలో ఎన్నడూ లేని విధంగా బుధవారం సోనియా గాంధీ లోక్సభలో ఆమె చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపిలతో తీవ్ర నిరసనలు చేయించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని స్తంభింపచేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సోనియా ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ ఎంపిలు కూడా సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు.
ప్రతిపక్ష పార్టీల సభ్యులు వారిని అనుసరించడం గమనార్హం. లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌధరి, ఇతర కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకుపోయేలా సోనియా మార్గనిర్దేశం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత కూడా సోనియా సభలోనే కూర్చుని పార్టీ సభ్యులకు సారథ్యం వహించారు. జీరో అవర్లో మాట్లాడిన ఆమె.. మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్దరించాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఒక దశలో నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుడు హసన్ మసూద్ అనుబంధ ప్రశ్న వేయడానికి నిలుచున్నప్పుడు సోనియాగాంధీ ఆయనను కూర్చోవలసిందిగా కోరారు. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సభ్యుడు మహమ్మద్ బషీర్ తన ప్రశ్నను వేయడానికి సిద్ధమవుతుండగా …పెట్రోలియం ధరలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిగా సోనియా ఆయనకు సూచించారు.