‘మిషన్ ఇన్ గుజరాత్’పై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ ఏడాది చివరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంకు దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ పర్యాయం గెలుపోండంపట్ల తీవ్రంగా దృష్టి సారిస్తున్నది.
అందుకోసమే, పలు రాష్ట్రాలలో వివిధ పార్టీలు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించినట్లు భావిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ సేవలను కాంగ్రెస్ వినియోగించుకోనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వారి పట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో కీలక ప్రాతినిధ్యం ఇస్తే ఆ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిన కిషోర్, అందుకు ఆ పార్టీ విముఖత వ్యక్తం చేయడంతో, అప్పటి నుండి కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అనుబంధం లేకుండా కేవలం ఓ ప్రొఫెషనల్‌గా పని చేసేందుకు ప్రశాంత్ కిశోర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
రాహుల్‌గాంధీతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు అంగీకారం తెలిపినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. యూపీలో కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి రాగా, అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది.
ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల్లోనూ ఆశించిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. అందుకనే ఇప్పుడు ఆ పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకోవాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు. కొంతమంది గుజరాత్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకోవడానికి ఆసిక్తగా చూపుతున్నట్లు సమాచారం.
ఈ అనుబంధం కేవలం గుజరాత్ కు పరిమితం కాకపోవచ్చని, 2024 ఎన్నికల వరకు కొనసాగుతుందని కూడా తెలుస్తున్నది. గుజరాత్ కాంగ్రెస్ నేతలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఇటీవల రాహుల్‌గాంధీ సమీక్ష నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కౌరవులు ఉన్నారు… వారిని గుర్తించి బయటకు పంపితే పార్టీ బాగుపడుతుందని రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా గుజరాత్ కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ కిశోర్ ప్రస్తావన తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడ కోసం కూడా అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మినహా కమిటీ, అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసింది. 25 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ నూతన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.