ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 31న నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ‘దేశంలో పెరుగుతున్న గ్యాస్, పెట్రో, డీజిల్ అపరిమిత పెరుగుదలకు వ్యతిరేకంగా చెవిటి బిజెపి సర్కార్‌ను అప్రమత్తం చేసేందుకు ఈ నెల 31న ఉదయం 11 గంటలకు ప్రజలు తమ ఇళ్ల వెలుపల లేదా బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు, డ్రమ్స్, గంటలతో పాటు ఇతర వాయిద్యాలతో నిరసన తెలపాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పిలుపునిచ్చారు.
సుమారు మూడు గంటలపాటు శనివారం జరిగిన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జిలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత.. దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు 80 పైసలు చొప్పున పెరిగింది. గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఈ నిరసనకు పిలుపునిచ్చింది.
మూడు దశల వారీగా ఆందోళనకు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మార్చి 31- ఏప్రిల్ 7 మధ్య ‘మెహంగారు ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో ఆందోళనలను చేపడుతున్నట్లు పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా ఎనిమిదేళ్లలో బిజెపి ప్రభుత్వం రూ. 26 లక్షల కోట్లను దోచుకుందని సూర్జేవాలా విమర్శించారు. రెండేళ్లలోనే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 29, రూ. 28.58 పెంచేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో వీటి ధరలు రూ. 71.41, రూ. 55.49గా ఉండేవని గుర్తు చేశారు.
తాము అధికారంలో ఉండగా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై రూ. 1.50 లక్షల కోట్లు సబ్సిడీ కింద ఇచ్చామని, కానీ ఈ ప్రభుత్వం కేవలం 11 వేల కోట్లు మాత్రమే ఇస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ పెట్రోల్‌పై 203 శాతం, డీజిల్‌పై 531 శాతం ఎక్సైజ్ డ్యూటీని పెంచిందని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కింగ్ ప్యాలస్ కోసం సిద్ధమవుతున్నాడని, ప్రజలు ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శలు సంధించారు.
నిరసనలకు రేవంత్ రెడ్డి పిలుపు
కాగా, మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ద్రవ్యోల్బణం ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా నిరసనలు, బైక్ ర్యాలీ నిర్వహిస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి తెలిపారు. దిష్టి బొమ్మల దగ్దం అనంతరం కలెక్టర్ల ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. కరోనాతో కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారని, ఇటువంటి క్లిష్ట సమయంలో ధరలు పెంచడంతో ప్రజలను మరింత కష్టపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఏప్రిల్ -1 నుంచి విద్యుత్ చార్జీలు పెంచడంతో రూ. 5 వేల 596 కోట్లు పేదల నుంచి గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. సర్ చార్జీల పేరుతో ఇంకో రూ 6 వేల కోట్లు లాక్కుంటుదన్న రేవంత్ ప్రజలపై భారీగా బారం మోపుతుందని పేర్కొన్నారు.
దేశ జీడీపీ పెరిగిందని గొప్పలు చెప్పే కేంద్రం జీడీపీకి రేవంత్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. జి-గ్యాస్, డి-డీజిల్, పి – పెంట్రోల్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ మూడింటి ధరలు పెరగడమేనా జీడీపీ? అని ఆయన ప్రశ్నించారు.
ఈ దోపిడిని అరికట్టేందుకే ఏఐసీసీ ఆదేశాలతో 31న నిరసన కార్యక్రమాలు చేపడుతామని, ఉగాది రోజున గ్యాప్ ఇచ్చి, ఏప్రిల్ 7 వరకు కొనసాగుతాయని వివరించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్, మోదీ దోపిడీలను నిలదీయాలని ఆయన కోరారు. సిలిండర్లకు దండలేసి, డప్పులు కొడుతూ, బైక్ ర్యాలీ, కేసీఆర్, మోదీ దిష్టి బొమ్మల దగ్దం లాంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.