ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బిజెపి కార్యకర్తలు చేపట్టిన నిరసన విధ్వంసంకు దారితీయడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమానుద్దేశించి ఇటీవల కేజ్రీవాల్ వరుసగా వ్యాఖ్యలు చేయడంతో బిజెపి కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. గోడలపై పెయింటింగ్ పూశారు. అడ్డుకున్న పోలీసులతో గొడవకు దిగారు.
కాశ్మీర్ హిందువుల మారణహోమాన్ని కేజ్రీవాల్ అపహాస్యం చేస్తున్నారంటూ బిజెపి నేతలు ఆరోపించారు. ఈ నిరసనకు నేతృత్వం వహించిన బిజెపి ఎంపి, యువమోర్చ జాతీయ అధ్యక్షుడు తేజశ్వి సూర్యను పోలీసుుల అదుపులోకి తీసుకున్నారు.
తేజస్వి సూర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను రాయితీని ఇవ్వడానికి నిరాకరించడం మాత్రమే కాకుండా, కశ్మీరులో హిందువుల ఊచకోతను కేజ్రీవాల్ ఎగతాళి చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాను ఎవరివైపు ఉన్నారో ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఆయన ఉగ్రవాదులవైపు ఉన్నారని ఆరోపించారు. ఈ అమానుష క్రూరత్వానికి ఆయన రాజకీయంగా భారీ మూల్యం చేల్లించుకుంటారని హెచ్చరించారు.
కాగా, ముఖ్యమంత్రి ఇంటికి బిజెపి కార్యకర్తలు చేరుకునేందుకు ఢిల్లీ పోలీసులే కారణమంటూ ఆప్ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్న సిసిటివి కెమెరాలు, భద్రతా వలయాన్ని సంఘ విద్రోహ శక్తులు ధ్వంసం చేశాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసుడియా ధ్వజమెత్తారు. ఢిల్లీ పోలీసుల సాయంతో బిజెపి గూండాలు రెచ్చిపోయారంటూ ట్వీట్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ అనుకుంటోందని ఆ పార్టీ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్‌లో ఓటమిని చవిచూడటంతో కేజ్రీవాల్‌ను చంపాలని ఆ పార్టీ కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు కూడా నమోదు చేస్తామని తెలిపారు.
ఇటువంటి వ్యాఖ్యలే ఆప్ నేత సంజరు సింగ్ చేశారు. కేజ్రీవాల్ నివాసంపై బిజెపి గూండాలు దాడి చేశారని, వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు మిన్నకుండిపోయారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమని, సమయం వచ్చినప్పుడు..ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారంటూ బిజెపినుద్దేశించి ట్వీట్ హెచ్చరించారు.
దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బిజెపి కార్యకర్తలు, ఆ పార్టీ జెండాలు చేతబూని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. కొంత మంది భద్రతా వలయాన్ని దాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సుమారు 150-200 మంది బిజెపి యువ మోర్చా కార్యకర్తలు సిఎం నివాసానికి బుధవారం ఉదయం 11.30 గంటకు చేరుకుని.. కాశ్మీర్ ఫైల్స్‌పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతం నుండి వారిని వెనక్కు పంపించామని, ఈ ఘటనకు కారకులైన 70 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
‘సుమారు 1 గంట సమయంలో కొంత మంది బారికేడ్లను దాటి.. సిఎం ఇంటి ఎదుటకు చేరుకున్నారు. అనంతరం నినాదాలు చేపడుతూ.. గొడవ చేపట్టారు. వారి వెంట తెచ్చుకున్న ఓ పెయింటింగ్ డబ్బాలోని రంగును తలుపులపై పూశారు. బూమ్ బారియర్‌తో పాటు సిసిటివి కెమెరాను నాశనం చేశారు’ అని పోలీసులు వెల్లడించారు.