స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపిచ్చారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన 19వ డీపీ కోహ్లీ స్మారకోపన్యాస సదస్సులో ‘ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం అత్యావశ్యకం అని తెలిపారు.
నాయకులు వస్తుంటారు, పోతుంటారు… కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీజేఐ అభిలషించారు. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ రావాలని ఆయన సూచించారు. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
పోలీసులు బాధ్యతను పెంపొందించుకోవాలని సూచిస్తూ రాజకీయ నాయకులతో కుమ్మక్కైతే తరువాత రోజుల్లో ఇబ్బందులు తప్పవని జస్టిస్ రమణ హెచ్చరించారు. అలాగే ఒక కేసును అనేక సంస్థలు దర్యాప్తు చేసే విధానానికి స్వస్తి పలికి సీబీఐ, ఎస్ఎఫ్ఐవో, ఈడీ లాంటి సంస్థలు ఒకే గొడుకు కిందకు రావాలని ఆయన సూచించారు.
‘‘మన దేశ సుసంపన్నమైన సంస్కృతిని, వారసత్వాన్ని ప్రజాస్వామ్యం నిలకడగా ఉంచుతోంది. స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరిగినప్పడు పాలకులను గద్దె దించేందుకు ప్రజలు వెనుకాడరు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. నిరంకుశ పోకడలకు అనుమతి ఇవ్వకూడదు” అని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి స్థానం లేదని తేల్చి చెబుతూ పోలీసుల సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని హితవు చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థల కంటే జాతీయ దర్యాప్తు సంస్థలపైనే ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉందని అన్న ఆయన తమ సమస్యల పరిస్కారినికి పోలీసులను ఆశ్రయించే వాతావరణాన్ని ప్రజలకు కల్పించాలని ఆయన సూచించారు.
పోలీసులు గురించి మాట్లాడుతూ… ‘అవినీతి ఆరోపణలతో పోలీసుల ప్రతిష్ట మసకబారుతుంది. అధికార మార్పిడితో వేధింపులకు గురవుతున్నామంటూ తరచూ పోలీసు అధికారులు మా వద్దకు వస్తుంటారు. కాలక్రమంలో రాజకీయ నేతలు మారతారేమో, కానీ మీరు శాశ్వతం’ అని స్పష్టం చేశారు. అయితే పోలీసుల్లా కాకుండా దర్యాప్తు సంస్థలకు రాజ్యాంగ మద్దతు లేదని తెలిపారు.
దర్యాప్తు సంస్థలు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లను వివరిస్తూ.. వారికి మౌలిక సదుపాయాల కొరత, మానవ శక్తి, ఆధునిక పరికరాలు, సాక్ష్యాలను సేకరించే సాధనాలు, రాజకీయ కార్యనిర్వాహక మార్పులతో ప్రాధాన్యతలతో మార్పులు, అధికారుల బదిలీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవే దోషులను నిర్దోషులుగా, నిర్దోషులను.. దోషులుగా మార్చేందుకు అవకాశాలున్నాయని పేర్కొంటూ వాటిని కోర్టులు అడుగడుగునా పర్యవేక్షించలేవని తెలిపారు.
ఏటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలని జస్టిస్ రమణ చెప్పారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, చాలావరకు నేర విచారణ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అవసరమని ఉద్ఘాటించారు. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. సంబంధాల మెరుగుకు పోలీసు శిక్షణ విధానంలో మార్పు రావాలని సూచించారు.