విద్యార్థులు పరీక్షలను గడ్డు సవాళ్లుగా చుకోకుండా, పండుగలుగా మలుచుకుని ఉత్సాహం ప్రదర్శించి ఫలితాలు రాబట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు హితవు చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షా కాలం ఆసన్నమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమంద్వారా విద్యార్థులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు.
విద్యార్థులు ఒత్తిడికి గురి కారాదని, సంవత్సరం చదివినదంతా పరీక్షలకు ముందుటి టెన్షన్లతో దెబ్బతింటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికే విద్యార్థులు పలు పరీక్షలు రాసి విజేయులు అయి ఉంటారని, ఎటువంటి పరీక్షను అయినా ధైర్యంగా మానసిక ఆందోళనకు గురి కాకుండా చూసుకుంటే ఎదుర్కొనవచ్చునని విజయం సాధించవచ్చునని ధైర్యం చెప్పారు.
పరీక్షా పే చర్చా ప్రక్రియలో ఇప్పటి భాగం ఐదవది. ఇంతకు ముందు కరోనా దశలలో ఈ కార్యక్రమం వర్చువల్‌గా సాగింది. అయితే ఇప్పుడు ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్ణీత విద్యార్థుల ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇచ్చారు. వారి అనుభవాలను తెలుసుకున్నారు. దీనిని దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ప్రత్యక్ష ప్రసారం దశలో శ్రద్ధగా వీక్షించారు.
విద్యార్థులు రాణించడం అధ్యాపకులు, తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందని చెబుతూ ప్రత్యేకించి పిల్లలపై తల్లిదండ్రులు తమ ఆకాంక్షలను రుద్దరాదని ప్రధాని వారిని వారించారు. జీవితంలో తాము నిజం చేసుకోలేని కలలను పిల్లలు సాకారం చేయాలనే తపన ఉండరాదని స్పష్టం చేశారు. విద్యార్థుల స్వభావం, వారి అభిరుచులకు అనుగుణంగానే వారు ఎంచుకునే విద్య ఉండాలని, అప్పుడే వారు పరీక్షలలో ఆ తరువాత జీవితాలలో నిర్ణీత విజయం సాధిస్తారని తెలిపారు.
కరోనా దశలో విద్యార్థులకు సెల్‌ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రతిభకు అడ్డంకిగా భావించుకోరాదని, దీనిని సమర్థవంతంగా వాడుకుంటే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయని తెలిపారు. అయితే వాట్సాప్, యూట్యూబ్‌లతో తమ దృష్టి మళ్లుతోందని, సెల్ఫోన్ల సాంకేతికను వంటబట్టించుకుంటున్న దశలోనే ఈ యాప్‌లతో తమ విద్యా ఏకాగ్రత దెబ్బతింటోందని విద్యార్థులు కొందరు వాపొయ్యారు.
విద్యార్థుల ఐటి సెల్‌ఫోన్ సంబంధిత సమస్య తీవ్రమైనదే అని అయితే మాధ్యమం కాదు మేధస్సు అనేదే కీలక అంశం అని ప్రధాని తెలిపారు. ఆన్లైన్లో అయినా పఠనం ద్వారా అయినా విద్యార్థులు తమ మేధస్సును నిలిపి పాఠ్యాంశాలపై దృష్టి సారిస్తే మంచిదని, ఏకాగ్రత అనేది మనసుకు సంబంధించినది, దీనిని మనం అదుపులో పెట్టుకుంటే అందుబాటులోకి వచ్చే ఎటువంటి ఐటి సాంకేతికత అయినా మనకు ఫ్రెండ్‌గానే ఉంటుందని ప్రధాని తెలిపారు.
విద్యార్థులు ఆన్లైన్ మీడియంను తమకు కలిసివచ్చే అదనపు సౌకర్యంగా భావించుకోవాలి, దీనిని తప్పుదోవ పట్టేందుకు వాడుకోరాదని హితవు పలికారు. ఆన్లైన్ కానివ్వండి ఆఫ్‌లైన్ కానివ్వండి, మనం వినియోగించేది మేధస్సు, సారించేది ఏకాగ్రతతో కూడిన దృష్టి. అంతర్ముఖులు అంటే ఇన్లైన్లు అయితే ఆన్లైన్ ఆఫ్‌లైన్‌లు అయినా సద్వినియోగం అవుతుందని తెలిపారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం పలు సృజనాత్మకతలను యువ విద్యార్థుల ఆవిష్కరణల శక్తిని ఇనుమడింపచేసేదిగా ఉందని ప్రధాని తెలిపారు. విద్యారంగంలో అభిరుచి కీలకం. విద్యార్థులు తమ ఇచ్ఛకు నచ్చినదే ఎంచుకునే విధంగా కొత్త విద్యా విధానంలో పలు ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న విద్యార్థులను ప్రధాని అభినందించారు.