మూడు రోజుల పాటు భారత దేశంలో పర్యటించిన నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా సంప్రదాయాలను పక్కన పెట్టి తన పర్యటన ప్రారంభంలోనే ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. ఈ విషయమై దేవుబా స్వదేశంలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆయన నేతృత్వం వహిస్తున్న నేపాల్ కాంగ్రెస్ కు భారత దేశంలోని కాంగ్రెస్ పార్టీతో, వివిధ రకాల సోషలిస్ట్ పార్టీలతో మొదటి నుండి మంచి సంబంధాలు ఉంటూ వచ్చాయి. పలు సందర్భాలలో నేపాల్ లో జరిగిన ఆ పార్టీ కార్యక్రమాలలో ఈ పార్టీల ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా, నేపాల్ కాంగ్రెస్ జరిపిన పలు పోరాటాలను సంఘీభావం కూడా ప్రకటించారు.
అయితే బిజెపికి, ఆ పార్టీ నాయకులకు నేపాల్ కాంగ్రెస్ తో చెప్పుకోదగిన సంబంధాలు పార్టీ పరంగా లేవు. అందుకనే మొదటిసారిగా బీజేపీకి కార్యాలయంను ఆ పార్టీ అధినేత ఒకరు సందర్శించడం ప్రాధాన్యత కలిగిస్తున్నది. దౌత్యపరమైన వ్యూహాలతో భాగంగా రెండు దేశాల అధినేతల ప్రయత్నాలలో భాగం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం, భారత ప్రధాని ఆహ్వానం మేరకు ఏదైనా అధికారిక పర్యటన సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను మర్యాదపూర్వకంగా సందర్శించడం, ప్రధాన మంత్రితో చర్చలు జరపడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖులు, మంత్రులు, అధికారులను కూడా కలవవచ్చు.
బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానం మేరకు దేవుబా బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. “నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్ళారా? లేదా ప్రధానమంత్రి హోదాలో దేవుబా న్యూఢిల్లీకి వెళ్లారా?” అని నేపాల్ మాజీ ఉప ప్రధాని, ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు భీమ్ రావల్ దేవుబా వ్యవహారంపై విమర్శలు కురిపించారు. అయితే నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో బిజెపి కార్యాలయం సందర్శించినట్లు నేపాల్ విదేశాంగ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.
గతంలో, డిసెంబర్ 1960, నేపాల్ రాజు మహేందా ఎన్నికైన పార్లమెంటును రద్దు చేసి, తన ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. భారతీయ సోషలిస్టులు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అప్పటి నుండి నేపాల్ కాంగ్రెస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు.
1990లో, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నేపాల్ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి నైతిక మద్దతునిచ్చేందుకు విపి సింగ్ ప్రభుత్వం నేపాల్‌కు పంపిన అఖిలపక్ష భారతీయ ప్రతినిధి బృందానికి చంద్రశేఖర్ నాయకత్వం వహించారు. కానీ ఈ బృందంలో బిజెపి ప్రతినిధులు పాల్గొనలేదు.
1992లో, బహుళ-పార్టీ ప్రజాస్వామ్యం, రాచరికం పాత్రనుప్రాముఖ్యతను తగ్గించిన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ జాతీయ సమావేశానికి భారత్ నుండి కేవలం బిజెపి మాత్రమే కె ఆర్ మల్కాని నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది.
నేపాల్‌ను రిపబ్లిక్‌గా మార్చాలనే లక్ష్యంతో మావోయిస్ట్ తిరుగుబాటు, 2005లో భారత మధ్యవర్తిత్వంతో నేపాలీ కాంగ్రెస్, ఇతర ప్రధాన కమ్యూనిస్ట్ గ్రూపులతో సహా రాజకీయ పార్టీల ఆమోదం పొందింది. నేపాల్ ను రిపబ్లిక్ అవడమే కాకుండా లౌకిక దేశంగా కూడా ప్రకటించుకున్నారు.
అయితే, భారతదేశంలో, చాలా మంది బిజెపి నాయకులు నేపాల్ హిందూ రాజ్యంగా, రాచరికంగా ఉండాలని ఆసక్తి చూపుతూ వచ్చారు. 2006 నుండి నేపాల్ లో అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. భారత్ లో 2014 నుండి బిజెపి అధికారమలో కొనసాగుతున్నది. అయిన కూడా నేపాల్ కాంగ్రెస్ తో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు కొనసాగుతున్నాయి.
నేపాల్‌లో, ఆరు డజనుకు పైగా సంస్థలు అప్పుడప్పుడు వీధుల్లోకి వస్తుంటాయి. కానీ అవి ఉమ్మడిగా తిరిగి నేపాల్ ను హిందూ రాజ్యంగా పునరుద్దరించాలని డిమాండ్ చేయడం లేదు. నేపాల్ లో పనిచేస్తున్న హిందూ స్వయంసేవక్ సంఘ్ కు మంచి ప్రాబల్యం ఉంది. అయితే, ఆ దేశపు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం గల పార్టీలలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ మాత్రమే హిందూ దేశంగా, రాచరిక వ్యవస్థతో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తుంది.
అయినా కెపి ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీల ప్రభుత్వంలో ఆ పార్టీ భాగస్వామమైనది. నేపాల్ దేశ జనాభాలో 86 శాతంకు పైగా హిందువుల జనాభా ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా `హిందూ అజెండా’ను విస్మరింపలేదు. ఒకప్పుడు ప్రపంచంలోని “ఏకైక హిందూ దేశం”గా నేపాల్ ఉండెడిది. ఓలీ, నేపాల్‌లోని మాడిలోని “అసలు అయోధ్య” అని,అక్కడే, శ్రీ రాముడు జన్మించారని అంటూ పేర్కొనడం గమనార్హం.
ప్రధానమంత్రిగా ఓలీ రెండు పర్యాయాలు కొనసాగినప్పుడు భారత దేశంలోని బిజెపి ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేవు. ఒక సారి భారత్ ఆర్థిక దిగ్బంధనం విధింపవలసి రాగా, మరోసారి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగింది. ఓలి చైనాతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆ దేశంతో వాణిజ్యం, రవాణా, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేశాడు.
నేపాల్ లోని ప్రధాన కమ్యూనిస్ట్ పార్టీలు – మావోయిస్టులు, యుఎంఎల్ కలసి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడంలో చైనా కూడా పాత్ర పోషించింది. జూన్ 2021లో ఓలీ ప్రభుత్వం కూలిపోయి దేవుబా బాధ్యతలు స్వీకరించడానికి దారితీసిన నెలల తర్వాత, బిజెపి విదేశీ వ్యవహారాల ఇన్చార్జి విజయ్ చౌతైవాలే నేపాల్ ప్రధాని భార్య అర్జు దేవుబాలో రాఖీ సోదరిని కనుగొన్నారు,
ఓక ఎన్జీఓను నడుపుతున్న ఆమె పార్టీ, పరిపాలన వ్యవహారాలపై ప్రభావం చూపుతున్నారు. ఇప్పుడు దేవుబా బిజెపి ప్రధాన కార్యాలయం ను సందర్శించడం నేపాల్ కాంగ్రెస్ తో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నంలో తొలి విజయంగా చెప్పవచ్చు.
మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ నుండి $500 మిలియన్ల గ్రాంట్ కోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడంతో నేపాల్, చైనా మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం కీలకంగా మారనున్నది.
ఇదే సమయంలో, దేవుబా ఖాట్మండుకు తిరిగి వెళ్ళేలోపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన విస్తృతమైన పూజ, విందు ఆతిధ్యం కూడా స్వీకరించారు. నేపాల్‌లో ఆదిత్యనాథ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశంలో ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా కన్నా, గోరఖ్‌నాథ్ పీఠ్ మహంత్‌గా చాలామంది అనుచరులు ఉన్నారు.
మాజీ ఉపప్రధాని, నేపాలీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బిమలేంద్ర నిధితో సహా మార్పు పలువురికి ఆయనతో సంబంధాలున్నాయి. 2006కి ముందు, సాధారణంగా నేపాల్ రాజవంశం గోరఖ్‌నాథ్‌ను తమ అధిష్టాన దేవతగా గౌరవించేవారు. గోరఖ్‌నాథ్ పీఠంకు నేపాల్‌లో గణనీయమైన ఆస్తులు ఉన్నాయి. మరియు ఆదిత్యనాథ్ నేపాల్ హిందూ రాచరికంగా కొనసాగాలి అంటూ బహిరంగంగా మద్దతు ఇస్తుంటారు.