అనూహ్యంగా మొత్తం 24 మంత్రులతో రాజీనామా చేయించి, ఈ నెల 11న కొత్తవారితో ప్రమాణస్వీకారం చేయించడానికి సిద్ధపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. మే, 2019లో ప్రమాణస్వీకారం రోజుననే రెండున్నరేళ్లకు మంత్రివర్గం మార్చివేస్తానని ప్రకటించిన జగన్ వివిధ కారణాల చేత ఇప్పటివరకు చేయలేక పోయారు.
ముందు సగం మందిని మారుస్తారన్నారు. ఆ తర్వాత 90 శాతం అన్నారు. కాదు అందరిని మారుస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. రాజీనామాలు చేయించిన తర్వాత నాలుగైదుగురు కొనసాగనున్నారనే లీక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 10 మందిని కొనసాగించవచ్చని అంటున్నారు. శనివారం ముఖ్యమంత్రిని కలసిన అనంతరం పాత, కొత్తల మేలుకలయకగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
సామజిక సమీకరణాలు అని చెబుతున్నా, ఏ ప్రాతిపదికన కొద్దిమందిని కొనసాగిస్తున్నారనే ప్రశ్న వస్తున్నది. ముఖ్యంగా సీనియర్ మంత్రులలో ధిక్కార ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. అలకలు, బెదిరింపులతో జగన్ మొదటిసారిగా జగన్ తలపట్టుకొంటున్నట్లు చెబుతున్నారు.
రాజకీయ ప్రాతిపదికన కాకుండా బెదిరింపులకు భయపడో, ఇతరత్రా వ్యక్తిగత అనుబంధాల కారణంగానే కొందరిని మంత్రులుగా కొనసాగించక తప్పడం లేదని చెబుతున్నారు. కొందరైతే తాము మంత్రిపదవులతో పాటు ఎమ్యెల్యేలుగా కూడా రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నారు. మంత్రిపదవి పోయినా మంత్రిహోదాతో కీలక పదవులు అప్పజెబుతామన్నా వారు శాంతించడం లేదు.
పార్టీలో జగన్ తిరుగులేని నాయకుడైనా, ఇప్పుడు మంత్రివర్గం మార్పుల విషయంలో ఒకింత వెనుకడుగు వేయక తప్పడం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నానిలను తప్పిస్తే పార్టీలో సంక్షోభం వస్తుందని `తిరుగుబాటు ఎంపీ’ రఘురామరాజు ప్రకటించినా వారెవ్వరూ ఖండించక పోవడం, పార్టీ వర్గాలు సహితం మౌనం వహించడం గమనార్హం.
గత ఎన్నికల సందర్భంగా జగన్ స్వయంగా గెలిపిస్తే వారిని మంత్రులుగా చేస్తానని బహిరంగసభలలో ప్రకటించారు. కానీ అటువంటి వారికి మంత్రి పదవులు ఇవ్వడానికి `సొంత మనుషులు’ నుండే ప్రతిఘటన ఎదురవుతుంది. తమ జిల్లాలో తమను మంత్రులుగా తొలగించి, తమ జిల్లాకు చెందిన మరో మంత్రిని కొనసాగిస్తే తమకు అవమానమని కొందరు సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
పైగా, తమను తొలగించి బలమైన నాయకులకు మంత్రి పదవులు ఇస్తే జిల్లాలో ఇక తమను ఎవరూ పట్టించుకోరని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కొత్త మంత్రుల ఎంపికలో సహితం జగన్ వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం అవుతున్నది. కొత్తగా ఏర్పడిన బాలాజీ జిల్లాలో మంత్రి కావడం ఖాయం అని ధీమాతో ఉన్న చెవిటిరెడ్డి భాస్కరరెడ్డిని తుడా చైర్మన్ గా పదవీకాలాన్ని రెండేళ్లపాటు పొడిగించడం ద్వారా ఆయన ఆశలపై నీళ్లు పోశారు.
మంత్రివర్గంలో మార్పుల తర్వాత పార్టీలో అసంతృప్తి సెగలు మరింతగా విజృభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేని నేతలను దగ్గరకు తీసుకోవడం ద్వారా ఎన్నికల ముందు జగన్ ప్రమాదకరమైన కసరత్తు చేస్తున్నారనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి.