వచ్చే ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికలకు ఛత్తీస్‌గఢ్ లో బిజెపిని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న `హిందుత్వ’ రాజకీయాలతో ఇక్కడ ప్రయోజనం పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు తామే అసలైన `హిందూ’ అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ‘రామ వన గమన టూరిజం సర్క్యూట్’ను వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో తొమ్మిది స్థలాలను అభివృద్ధి చేస్తోంది. ‘రామ వన గమన టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది అక్టోబరులో మాతా కౌసల్య దేవాలయాన్ని పునరుద్ధరించారు.
దీనిలో రెండో ప్రాజెక్టుగా శివ్రినారాయణ్ దేవాలయాన్ని పునరుద్ధరించి శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రామ చరిత మానస్ పారాయణం చేయించి, బహుమతులను కూడా ప్రకటించారు.
భూపేష్ బాఘెల్ మాట్లాడుతూ, అయోధ్య తరహాలో శివ్రినారాయణ్ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రామాయణంతో ఛత్తీస్‌గఢ్‌కు గొప్ప అనుబంధం ఉందని చెబుతూ రామ వన గమన మార్గంలో తొమ్మిది ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. శ్రీరాముడు 14 ఏళ్ళ వనవాసం సమయంలో శివ్రినారాయణ్ వద్ద బస చేసినట్లు తెలుస్తోంది.
రామ వన గమన మార్గం ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయాలనుకున్న తొమ్మిది స్థలాల్లో మాతా కౌసల్య దేవి దేవాలయం, శివ్రినారాయణ్ దేవాలయం పూర్తయ్యాయి. మిగిలినవాటిని కూడా వచ్చే శాసన సభ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
హిందుత్వ రాజకీయాల నుంచి తన ప్రత్యర్ధి బీజేపీ లాభపడకుండా చూడాలనే ప్రయత్నం దీనిలో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మిగిలిన స్థలాలు : సీతామఢి హర్‌చౌక (కొరియా), రామ్‌గఢ్ (సర్గూజా), టుర్టురియా (బలోడబజార్), రాజిమ్ (గరియాబంద్), శిహవ సప్తరుషి ఆశ్రమం (ధంతరి), జగదల్పూర్ (బస్తర్), రామారం (సుక్మా). మాతా కౌసల్య దేవి జనన తేదీని కచ్చితంగా తెలుసుకునేందుకు చరిత్రకారుల సహాయాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరింది.