నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభ స్థానంకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా విజయం సాధింపలేక పోయింది. అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మినహా మిగిలిన అన్ని చోట్ల బీజేపీ ద్వితియ స్థానంలో ఉండగలిగింది. గతంలో వాజపేయి మంత్రివర్గంలో పనిచేసి, బిజెపి ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా పశ్చిమ బెంగాల్ నుండి టిఎంసి అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు.
అదే విధంగా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పనిచేసి, మంత్రి పదవి పోవడంతో ఎంపీ పదవికి, బిజేపికి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సింగర్ బాబూల్ సుప్రియో కూడా టిఎంసి అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బిహార్‌లలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.
రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రస్ కైవసం చేసుకోగా, ఒక అసెంబ్లీ స్థానంతో పాటు, లోక్ సభ స్థానాన్ని టిఎంసి గెలుపొందింది. బీహార్ లో అధికార కూటమి నుండి ఒక అసెంబ్లీ స్థానంను ఆర్జేడీ కైవసం చేసుకుంది.
బిహార్‌లోని బొచహన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థఇ అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 ఓట్ల శాతంతో 82,547 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి యశోదా నీలాంబర్ వర్మ 53.55 ఓట్ల శాతంతో విజయం సాధించారు.
మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే జోరు కొనసాగించింది. కొల్లాపూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్ ఏకంగా 53.93 ఓట్ల శాతంతో 83,088 ఓట్లు సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్సీపీ, శివసేన పోటీకి దూరంగా ఉన్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ కేంద్రమంత్రి బాబూల్ సుప్రియో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో సీపీఎం అనూహ్యంగా రెండో స్థానంలోకి రావడం గమనార్హం.
టీఎంసీ 49.22 శాతం, సీపీఎం 30.89 శాతం ఓట్లు రాబట్టగా బీజేపీ కేవలం 12.31 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి శత్రుఘన్ సిన్హా విజయం సాధించారు. గతంలో బీజేపీ నేత అయిన శత్రుఘన్, మొదట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం కొద్ది రోజుల క్రితం టీఎంసీలో చేరారు.