దేశంలో ఈమధ్యకాలంలో నెలకొన్న వివాదాస్పద సంఘటనలపై, , చోటు చేసుకుంటున్న వరుస ఉదంతాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడంపై విపక్షాలు ప్రశ్నించాయి. ముఖ్యంగా శ్రీరామ నవమి సందర్భంగా చోటుచేసుకున్న మత ఘర్షణలను ప్రస్తావిస్తూ మొత్తం 13 ప్రతిపక్ష పార్టీలు శనివారం రోజున సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
తారతమ్యాలకు, రాగద్వేషాలకు తావులేకుండా దేశం మొత్తం శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన ఆ పార్టీలు హింసకు కారణమైనవాళ్లను వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఘర్షణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడంపై ప్రతిపక్షాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సంయుక్త ప్రకటనను విడుదల చేసిన వారిలో ఉన్నారు.
వీరితో పాటు సంతకాలు చేసిన వారిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ కార్యదర్శి డి రాజా, ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన దేబబ్రత బిస్వాస్, ఆర్‌ఎస్‌పికి చెందిన మనోజ్ భట్టాచార్య, ముస్లిం లీగ్‌కు చెందిన పికె కున్హాలికుట్టి, సిపిఐ(ఎంఎల్) లిబరీషన్స్కి చెందిన దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు. అయితే, శివసేన, ఆప్ నేతలు ఎవ్వరు లేకపోవడం గమనార్హం.
మతోన్మాదాన్ని ప్రచారం చేసే వాళ్ల మాటలను, వాళ్ల చర్యలను ఖండించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శిస్తూ ఆయన మౌనం.. ఇటువంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుందని స్పష్టం చేశాయి. వాళ్లు సంఘంలో విలాసాలను అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచిందని ఆరోపించాయి.
తినేతిండి, కట్టుకునే బట్ట, వాళ్ల వాళ్ల విశ్వాసాలు, పండుగలు, భాషకు..ఇలాంటి విషయాలను పాలక వ్యవస్థలోని వర్గాలు మన సమాజాన్ని ధ్రువీకరించడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నతీరుపై విచారం వ్యక్తం చేశారు. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన సంఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారమనే అండతో రెచ్చిపోతున్నారని పేర్కొంటూ అలాంటి వాళ్లపై అర్ధవంతమైన, బలమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హిజాబ్, హిందీ భాష, తిండిపై ఆంక్షలు, మత ఘర్షణలు.. ఇలా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న అంశాలపైనే ఈ పార్టీలు, ప్రధాని మోదీని నిలదీసినట్లు అర్థమవుతోంది.