దివ్యాంగుల పట్ల ఉన్న సామాజిక దృక్పథాన్ని మార్చాల్సిన తరుణమిదేనని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వారిపట్ల సానుభూతిని చూపించాల్సిన అవసరం లేదని, చేయూతనందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ముందుకు సాగాలని హితవు చెప్పారు.
వారిపట్ల ఉన్న వివక్షతను నిర్మూలించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు సమాజం కూడా తన వంతు పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి చెప్పారు. దివ్యాంగుల్లో సహజంగానే వివిధ అంశాలకు సంబంధించిన తెలివితేటలు ఉంటాయని చెబుతూ వాటిని గుర్తించి పదునుపెట్టాలని చెప్పారు.
హైదరాబాద్ బోయినపల్లిలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’ (ఎన్ఐఈపీఐడీ)ని ఆదివారం ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వారి కుటుంబసభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన సమాజాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేసేందుకు ఎన్ఐఈపీఐడీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.
దివ్యాంగుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయడం చాలా అవసరం అన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా ‘యాక్సెసెబుల్ ఇండియా’ ఉద్యమం ద్వారా సానుకూలమైన మార్పులు కనబడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, రవాణా, సమాచార ప్రసార వ్యవస్థలు మొదలైన ఏర్పాట్లను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
దివ్యాంగ విద్యార్థులు చదువుకునే పాఠశాల్లో ఉపాధ్యాయులు, బోధనేత సిబ్బంది కూడా ఇలాంటి విద్యార్థుల సమస్యలను గుర్తెరిగి వారికి చేయూత అందించాలని కోరారు. నానాటికీ పెరుగుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ దివ్యాంగులకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటుచేయడంలో జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని సూచించారు.
స్మార్ట్ టెక్నాలజీ ని దివ్యాంగులకు అందించేందుకు విశిష్టమైన కృషిచేయాలని చెప్పారు. శిశువుల్లో బాల్యంలోనే ఉండే సమస్యలను వెంటనే గుర్తించి వాటికి సరైన పరిష్కారాలు చూపించాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఈ దిశగా ఎన్ఐఈపీఐడీ వంటి సంస్థలు, సీసీఎంబీ వంటి సంస్థలతో అనుసంధానమై పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తద్వారా చిన్నారుల్లో వికలాంగ సమస్యలు తీవ్రతరం కాకుండా చూసేందుకు వీలవుతుందని చెప్పారు. ఇందుకోసం తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.