త్వరలోనే దేశంలోని బిజెపియేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపి సంజయ్ రౌత్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని , కేంద్రంలోని బిజెపి సారథ్యపు ప్రభుత్వ వైఖరితో తలెత్తుతున్న సమస్యలను ఈ సమావేశంలో సమీక్షిస్తారని ఆయన తెలిపారు.
బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల సిఎంలందరికీ ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు. అంతా ఒక్కచోట సమావేశం కావాలని ఆమె కోరారు. ఈ మేరకు ముంబైలో ఈ సమావేశం త్వరలో ఏర్పాటు అవుతుందని, తేదీని ఖరారు చేసి వెల్లడిస్తామని రౌత్ తెలిపారు.
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు.
మత ఘర్షణలతో లబ్ధి పొందే బిజెపి వ్యూహం
కాగా, దేశంలో మతఘర్షణలను రేకెత్తించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బిజెపి వ్యూహమనిసంజయ్ రౌత్ ఆరోపించారు. శ్రీరాముని పేరుతో మత ఘర్షణలు చెలరేగడం రాముడి ఆలోచనను అవమానించడమేనని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోవ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి శ్రీరాముడే విసుగెత్తిపోయాడని ఎద్దేవా చేశారు.
దేశవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై .. ‘సామ్నా’ పత్రిక వేదికగా సంజయ్ రౌత్ స్పందిస్తూ దేశాన్ని ఛిన్నాభిన్నం చేసైనా సరే ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యూహాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. ఎవరైతే మతవాదంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటారో .. వారు దేశంలో రెండో విభజనకు బీజాలు వేసినట్లేనని స్పష్టం చేశారు.
గతంలో శ్రీరామ నవమి వేడుకలు సంస్కఅతికి వారధిగా ఉండేవని, ఇప్పుడు కత్తులు దూసి మత విద్వేషాలకు రెచ్చగొట్టేందుకు వేదిక అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రామ మందిర ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపేసిన వారే, ఇప్పుడు శ్రీరాముడి పేరుతో కత్తులు దూస్తున్నారని, ఇది హిందూత్వవాదం కాదని, ఇలాంటి పనులు శ్రీరాముడి ఆలోచనలకే విరుద్ధమని స్పష్టం చేశారు.
‘అసలు శ్రీరామనవమి రోజు ఎందుకు హింస జరిగింది? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సొంత నియోజకవర్గాలైన గుజరాత్లో శ్రీరామ నవమి యాత్రపై ముస్లింలు దాడి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా?’ అని ప్రశ్నించారు.
అలాగే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే కూడా రాష్ట్రంలో బిజెపి అజెండాను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రాష్ట్రపతి పాలన విధించేందుకు రాజ్‌థాకరే యత్నిస్తున్నారని, వారి అజెండా అదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.