గత ఏడాది కాలంగా కాంగ్రెస్ లో కీలక పదవి కోసం బేరసారాలు చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చివరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీలు జరుపుతున్న ఆయన ఈ విషయమై సమాలోచనలు జరిపారు.
ఈ విషయమై పార్టీలో సహచరులతో కూడా సోనియా సంప్రదించగా, వారంతా ఆమె నిర్ణయానికి వదిలివేశారు. గత ఏడాది సహితం ఇటువంటి చర్చలు జరిగాయి. గత ఆగష్టు లో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కొందరు నాయకులు కూడా చెప్పారు. అయితే ఏ పదవి ఇవ్వాలి అన్నదానిపై ఒక అవగాహనకు రాలేక, ప్రశాంత్ కిషోర్ అప్పటి నుండి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.
ఇదివరలో సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడిగా కీలక పాత్ర వహించిన అహ్మద్ పటేల్ హోదా తనకు కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తున్నది. ఎన్నికలకు సంబంధించి తన నిర్ణయమే తుది నిర్ణయం కావాలని, సోనియా తప్ప మరెవ్వరు ప్రశ్నించరాదని కూడా షరతు పెట్టారు. అయితే అందుకు కాంగ్రెస్ నాయకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన పార్టీలో చేరడం కూడా వాయిదా పడింది.
పలు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల నిర్వహణలో సలహాదారునిగా వ్యవహరిస్తున్నప్పటికీ, వారి ప్రభావం ఆయా రాష్ట్రానికే పరిమితం కావడంతో జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహించాలి అంటే కాంగ్రెస్ తప్ప మరొకటి లేదని గ్రహించి, ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీతో సర్దుబాటుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నది.
2014 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర వహించడం ద్వారా దేశ ప్రజల దృష్టి ఆకట్టుకున్న ఆయనకు ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో, బిజెపి వ్యతిరేక పార్టీలకు పరిమితమవుతూ వస్తున్నారు.
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడిన్నట్లు తెలుస్తున్నది. ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల నిర్వహణ, వ్యూహరచన, పొత్తుల ఖరారు బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని, రాష్ట్రాల వారీగా అవలంబించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలకు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఆయన సలహాలు, సూచనలపై ఈ నేతలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సోనియాకు కార్యాచరణను సూచిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తక్షణమే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ దృష్టి సారించడంతో పాటు, కర్ణాటక, తెలంగాణ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర వహించే అవకాశం ఉంది.