మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్యెల్యే అయిన ఆమె భర్త రవి రానా హనుమాన్ చాలీసా చదువుతామని ప్రకటిస్తే, శివసేన కార్యకర్తలు వారి ఇంటి ముందు నిరసనలు చేపట్టడం, మత వైమాశ్యాలు కలిగిస్తున్నారని అంటి ముంబై పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
ఈ వ్యవహారంలో శివసేన, బిజెపి, ఎన్‌సిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సిపికి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట (ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ అధికారిక నివాసం) హనుమాన్ చాలీసా చదివేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ప్రధాని ఇంటివద్దకు ఈ వివాదం చేరినట్లయింది.
హనుమాన్ చాలీసాతో పాటు నమాజ్, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. దీంతో ఆమె లేఖ చర్చనీయాంశంగా మారింది.
ఇలా ఉండగా, ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల వ్యవహారంపై శివసేన పత్రిక సామ్నాలో ప్రత్యేక కథనం వచ్చింది. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ కుట్ర పన్నుతోందని శివసేన తన పత్రిక సామ్నాలో ఆరోపించింది. హిందుత్వ పేరుతో బీజేపీ శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా చేసిందని ఆరోపించింది.
రాణా దంపతులను వాడుకుని ముంబైలో హింసకు పధకం చేశారని కథనంలో పేర్కొన్నారు. గతంలో శ్రీరాముడి పేరుతో ప్రమాణం చేస్తున్న చట్టసభ సభ్యులను వ్యతిరేకించిన నవనీత్ రాణా హనుమాన్ చాలీసా పఠనంపై వ్యవహరించిన తీరు పట్ల ఆశ్చర్యం ప్రకటించింది. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా పోటీ చేసి గెలుపొందారని రాణా దంపతులపైన ఆరోపణలు చేసింది.
రాణా దంపతులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. హిందుత్వను మర్చిపోయిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం దగ్గర చాలీసా చదువుతామన్న రాణా దంపతుల ప్రకటనలో శనివారంలో ముంబైలో హై డ్రామా నడిచింది.
తమ నివాసం ఎదుట ఆందోళనకు దిగారన్న రాణా దంపతుల ఫిర్యాదుతో.. 13 మంది శివసేన కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. తర్వాత వారు బెయిల్ పై విడుదలయ్యారు. మరో వైపు రాణా దంపతుల బెయిలు దరఖాస్తుపై ఏప్రిల్ 29న విచారణ జరపనుంది కోర్టు