బిజెపి బలహీన పడితే తానే ప్రధాన మంత్రి అవుతాననే మితిమీరిన విశ్వాసంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయోగాలు చేస్తూ ఉండడంతో నేడు దేశంలో ఆ పార్టీతో జత కట్టడానికి ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల ఆ పార్టీ నేతలలోనే అనుమానాలు బయలుదేరాయి.
అదను కోసం ఎదురు చూస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి వచ్చి ఎన్నికల నిర్వహణ బాధ్యతను తనకు అప్పగిస్తే 2024లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తానని కాంగ్రెస్ నాయకుల ముందు ఓ రంగుల ప్రపంచం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ లో ఒక విధంగా గతంలో అహ్మద్ పటేల్ నిర్వహించిన పాత్ర తనకు ఇవ్వాలని కోరుతున్నారు.
ఎన్నికల పొత్తు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం ఎత్తుగడలతో తన నిర్ణయాలే చెల్లుబాటు కావాలని, సోనియా గాంధీ మినహా మరెవ్వరు ప్రశ్నించరాదని ప్రధానంగా ఆయన పెడుతున్న షరతు కాంగ్రెస్ నాయకులను ఆలోచింప చేస్తుంది. గత ఏడాది కూడా దాదాపు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ పార్టీలో ఆయనకు ఇచ్చే హోదా గురించే ఓ నిర్ణయానికి రాలేక అది సాధ్యం కాలేదు.
గత ఏడాది కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ లో నిరాశాజనకర ఫలితాలు, కేరళలో అధికారంలోకి రాలేక నిరుత్సాహంగా ఉన్న సమయంలో ప్రశాంత్ కిషోర్ రంగ ప్రవేశం చేశారు. పార్టీని గాడిలో పెట్టడానికి అతనే సరైన వ్యక్తి అని మొదట ప్రియాంక గాంధీ వాద్రా సూచించినప్పుడు పార్టీలో ప్రతిఘటన వచ్చింది. రాహుల్ గాంధీకి సన్నిహితులైన లెఫ్టినెంట్లు కూడా తమ రెక్కలను కత్తిరించే అవకాశం ఉన్నదని వ్యతిరేకించారు.
కానీ ఈ సారి సోనియా గాంధీ స్వయంగా కిషోర్‌ను కలవడం, 2024 లోక్‌సభ ఎన్నికలను ఎలా నిర్వహించాలనే ప్రజెంటేషన్‌ను వినడంతో, గాంధీ కుటుంబం సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇందులో ప్రధానంగా 2024లో కూడా పార్టీ విఫలమైతే అతనిపై నెట్టివేయవచ్చు. రాహుల్ గాంధీ ఇమేజ్ కు భంగం లేకుండా ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టక పోవడం, మరెవ్వరినీ ఆ పదవిలోకి రానీయక పోవడానికి కారణం పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం లేకపోవడం. పరాజయాలను మూటగట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేకపోవడమే. శరద్ పవర్, మమతా బెనర్జీ వంటి కీలక ప్రతిపక్ష నేతలు ఎవ్వరు రాహుల్ గాంధీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా లేరు. అందుకనే జాతీయ స్థాయిలో రాహుల్, కాంగ్రెస్ నేతృత్వంలో కూటమికి కూడా సిద్ధపడటం లేదు.
ప్రశాంత్ కిషోర్ కు ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా సంబంధాలు ఉండడంతో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా బిజెపిని ఓడింపలేమని వారిని ఒప్పించి ఓ వేదికపైకి తీసుకు రాగలరని ప్రధానంగా గాంధీ కుటుంబం ఆశిస్తున్నది. ఇక్కడే కాంగ్రెస్ లో పలువురు నాయకలు ప్రశాంత్ పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తన సత్తాను నిరూపించుకొంటే, 2024 ఎన్నికల బాధ్యత అప్పజెప్పడం చూద్దాం అంటున్నారు.
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్నా, ప్రశాంత్ కిషోర్ వచ్చి తమను ఒడ్డుకు చేరుస్తారనుకొంటూ గుజరాత్ లో కాంగ్రెస్ నేతలు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ సమర్పించిన ప్రెజెంటేషన్‌పై చర్చించడానికి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించిన కొన్ని రోజుల తర్వాత, ఆమె మరో అంతర్గత బృందాన్ని-సాధికారత కార్యాచరణ గ్రూప్ 2024- ఏర్పాటు చేశారు. అయితే, గ్రూప్ కూర్పు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మే 13 నుండి మే 15 వరకు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మేధోమథనకోసం నవ్ సంకల్ప్ చింతన్ శిబిరం నిర్వహించనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. అప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ విషయమై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు.
ఈ లోగా ఇప్పటికే ఆయనతో ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వంటి వారు కిషోర్ కాంగ్రెస్ లో చేరితే అతనితో తమ సంబంధాల విషయంలో డైలమాలో పడ్డారు. వీరందరిని సహితం కాంగ్రెస్ నేతృత్వంలో బిజెపి వ్యతిరేక కూటమి కిందకు తీసుకు రావాలని కిషోర్ సంకల్పిస్తున్నా ఆచరణలో ఆయా పార్టీలకు `ఆత్మహత్యసదృశ్యం’ కాగలదు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరినా ఒక `వాణిజ్య పక్రియ’గా, తన చిరకాల లక్ష్యమైన బిజెపిని ఓడించి, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహించేందుకు ఓ వేదిక కోసం చేరడమే గాని, ఆ పార్టీకి కట్టుబడి ఉంటారనే నమ్మకం కాంగ్రెస్ నేతలకు కుదరడం లేదు. ముఖ్యంగా ఆయన `రాజకీయ విధేయత’ను విశ్వసింపలేక పోతున్నారు. ఓ వంక గాంధీ కుటుంబంతో సమాలోచనలు జరుపుతూనే అస్సాంలో టిఎంసిలో చేరడానికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన రిపున్ బోరాను ఆయన అభినందించడం కాంగ్రెస్ వారికి దిగ్బ్రాంతి కలిగించింది.
2024లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య సంఖ్యలను తనకు కాంగ్రెస్ వదిలిపెట్టే విధంగా చేసుకొనే ప్రయత్నమే కిషోర్ లో కనిపిస్తున్నది. ప్రాంతీయ పార్టీలలో ఒకే నాయకుడు లేదా ఒకే కుటుంభ నాయకత్వంతో అటువంటి ప్రయత్నాలు సాధ్యమైనా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో చెలామణి కావడం కొంచెం కష్టమే కావచ్చు. అనేక పరస్పర వ్యతిరేక బృందాలను కలుపుకు పోవలసి ఉంటుంది.
తన సామర్ధ్యాల గురించి కిషోర్ అమితంగా అంచనా వేసుకోవడంతోనే సమస్య వస్తున్నది. తన సారధ్యంలో ఏపీ, బెంగాల్, తమిళనాడులలో ప్రాంతీయ పార్టీలు విజయం సాధిచడాన్ని చూపుతున్నారు గాని 2017లో యుపిలో కాంగ్రెస్ తో జరిపిన కసరత్తు ఫలించలేదని మరచి పోతున్నారు. అదే సంవత్సరం పంజాబ్ లో సహితం అతని పాత్రను పరిమితం చేయడం ద్వారానే కెప్టెన్ అమరిందర్ సింగ్ కాంగ్రెస్ ను గెలిపించుకో గలిగారు.
2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ప్రచార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తనకు కీలక పాత్ర రాగలదని ఆశించారు. అయితే అప్పుడే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన అమిత్ షా తాను కాకుండా అక్కడ మరో అధికార కేంద్రం ఉండడానికి ఇష్టపడక దూరంగా ఉంచడంతో, తప్పనిసరి పరిస్థితులలో బిజెపికి దూరం అయ్యారు.
ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా విజయాలు సాధించినా జాతీయ స్థాయిలో తగు ప్రాధాన్యత లభించడంలేదని గ్రహించి, బిజెపికి దూరంగా ఉన్న నితీష్ కుమార్ చెంత చేరారు. జెడియు జాతీయ ఉపాధ్యక్షునిగా నీయయించి, నితీష్ మంచి గౌరవం ఇచ్చారు. అయితే నితీష్ తిరిగి బిజెపికి దగ్గరగా చేరడంతో నిరుత్సాహపడి బైటకు వచ్చారు. గత ఏడాది బీహార్ ఎన్నికలలో సొంత పార్టీ పెట్టి, రాష్ట్రం అంతా పోటీ చేస్తానని ప్రకటించి కూడా, కిషోర్ వెనుకడుగు వేశారు.
అయితే కిషోర్ ఎత్తుగడలు అన్ని పరోక్షంగా బిజెపికి సహాయకారిగా ఉంటూ ఉండడంతో ఆయన `విధేయత’ పట్ల కాంగ్రెస్ వర్గాలలో సందేహాలు కలుగుతున్నాయి. గోవాలో టిఎంసి ప్రచారం చేపట్టి, ఆ పార్టీకి 6 శాతం ఓట్లు వచ్చేటట్లు చేసి, పరోక్షంగా కాంగ్రెస్ కాకుండా బిజెపి అధికారంలోకి వచ్చేటట్లు చేశారు.
ఏపీలో టిడిపి కాకుండా వైసిపి అధికారంలోకి రావడం పరోక్షంగా బిజెపికి సహాయకారిగా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన్నట్లు కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొంటే, తెలంగాణాలో బిజెపికి అవకాశం ఇచ్చిన్నట్లే కాగలదు. ఇప్పటి వరకు ఎక్కువగా ఆయన వ్యూహాలు బిజెపి వ్యతిరేక లేదా కాంగ్రెస్ అనుకూల ఓట్లలో చీలికకే దోహదపడుతున్నాయి. అందుకనే ఆయన `రాజకీయ లక్ష్యాలు’ అనుమానాస్పదంగా ఉంటున్నాయి.