తన జీవితపు చివరి సమయాన్ని తాను ఆరోగ్య రంగానికి కేటాయిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తెలిపారు. మిగిలిన కాలాన్ని తాను ఆరోగ్యానికి అంకితం చేస్తానని, ఈ విధంగా తాను అసోం ఆరోగ్య పరిరక్షణను గుర్తించేలా చేయడం ఇతర ప్రాంతాలు అసోంను ఆరోగ్యపరంగా గుర్తించేలా చేయడం తన లక్షాలని వెల్లడించారు.
గురువారం 84 ఏండ్ల టాటా ప్రధాని మోడీతో కలిసి భారీస్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించి తరువాత మాట్లాడారు. ప్రధానితో కలిసి అసోంలో ఏడు నూతన క్యాన్సర్ సెంటర్లను కూడా రతన్ టాటా ప్రారంభించారు. సాధారణంగా ఇటువంటి ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండే రతన్ టాటా ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు గురించి ప్రస్తావించారు.
అసోం ఇప్పడు ఆరోగ్య విషయాలలో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సలో అగ్రగామి అయ్యే దిశలో ఇది ఓ తొలి అడుగు అవుతుందని తెలిపారు. ప్రధాని మోదీ, అసోం సిఎం అండదండలు లేకపోతే ఇక్కడ అధునాతన చికిత్సా కేంద్రాల ఏర్పాట్లు సాధ్యం కాకుండా ఉండేవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్య, విద్యా రంగానికి సంబంధించిన వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజీ తదితర ప్రాజెక్టులను ప్రారంభించారు.‘‘ఆసుపత్రులు మీ సేవలో ఉన్నాయి, కానీ ఈ కొత్త ఆసుపత్రులు ఖాళీగా ఉంటే నేను సంతోషిస్తాను; నేను మీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను. మా ప్రభుత్వం యోగా, ఫిట్నెస్, ‘స్వచ్ఛత’తో నివారణ ఆరోగ్య సంరక్షణపై కూడా దృష్టి సారించింది. దేశంలో కొత్త పరీక్షా కేంద్రాలను తెరుస్తున్నారు’ అని ప్రధాని తెలిపారు.
ఈ సందర్భంగా అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న కేంద్రంలోని సౌకర్యాలు, పరికరాలను ప్రధాని పరిశీలించారు. ఇలాంటి మరో ఆరు సౌకర్యాలను బార్పేట, తేజ్‌పూర్, జోర్హాట్, లఖింపూర్, కోక్రాఝర్, దర్రాంగ్‌లలో కూడా ప్రారంభించారు. ఇదే కార్యక్రమం ప్రాజెక్టు కింద ధుబ్రి, గోల్పారా, గోలాఘాట్, శివసాగర్, నల్బరీ, నాగాన్ మరియు టిన్సుకియాలో ఏడు ఆసుపత్రులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
టాటా ట్రస్ట్‌ల ప్రతినిధి ఒకరు ఇంతకుముందు మాట్లాడుతూ, ఇలాంటి మరో మూడు క్యాన్సర్ కేర్ సదుపాయాలు పూర్తి దశలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరిలో తెరుస్తామని తెలిపారు. 17 వైద్య సదుపాయాలు, టాటా ట్రస్ట్‌ల క్యాన్సర్ నియంత్రణ నమూనా కింద “అతిపెద్ద” నెట్వర్క్, అస్సాం నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా సంవత్సరానికి 50,000 మందికి సేవలను అందించనున్నట్లు ఆయన చెప్పారు.