పంజాబ్‌లోని పటియాలాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పటియాలాలో శివ సేన ఖలిస్తాన్ వ్యతిరేక మార్చ్ నిర్వహిస్తుండగా రెండు గ్రూపుల మధ్య వివాదం నెలకొంది. ఇది ఘర్షణకు దారితీసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటియాలా జిల్లాలో 11 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.
అయితే అన్ని అత్యవసర, అవసరమైన సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని కోర్టు తెలిపింది.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాటియాలా ఘర్షణలపై తక్షణ విచారణకు ఆదేశించారు.ఈ ఘర్షణకు పాల్పడిన నిందితులలో ఎవరినీ విడిచిపెట్టవద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులను సీఎం మాన్ ఆదేశించారు.
ఈ మార్చ్‌ను పంజాబ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లా నిర్వహించారు. కాళి మాత దేవాలయానికి సమీపానికి ర్యాలీ చేరుకోగానే ‘ఖలిస్తాన్ ముర్దాబాద్’ అంటూ శివసేన సైనికులు నినాదాలు చేపట్టారు. దీంతో సిక్కు సంఘాలకు చెందిన కత్తులు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు.
అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. రాళ్లు రువ్వుకోవడం, కత్తులు ఝళిపించడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఖలిస్థాన్ అనుకూలవాదులు దొమ్మికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
గ్రూపులు గొడవను పెద్దది చేసుకోవడంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. పోలీసులు కాల్పులు జరిపిన కొద్దిసేపటికి ఈ మార్చ్ నిర్వహించిన హరీష్ సింగ్‌లను `పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు’ బహిష్కరిస్తున్నట్లు శివసేన రాష్ట్ర అధ్యక్షుడు యోగరాజ్ శర్మ ప్రకటించారు.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే, జాతీయ కార్యదర్శి అనిల్ దేశాయ్ ఆదేశాలపై బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే తనను బహిష్కరించే అధికారం శర్మకు లేదని సింగ్లా స్పష్టం చేశారు. రాష్ట్ర విభాగం అధ్యక్షునిగా కొత్తవారిని పార్టీలో చేర్చుకోవడమే గాని, తన వంటి సీనియర్ నాయకుడిని బైటకు పంపే అధికారం లేదని చెప్పారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేస్తూ ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై డిజిపితో మాట్లాడానని, ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరించామని తెలిపారు. అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో విఘాతం సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పంజాబ్‌లో శాంతి, సామరస్యం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని జిల్లా యంత్రాంగం స్థానికులకు విజ్ఞప్తి చేసింది. ఇరు గ్రూపులు తమ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అభ్యర్థించింది.