ఐరోపాతో భాగస్వామ్యం భారత్ కు కీలకం అని చెబుతూ తన పర్యటన ద్వారా భారత్‌కు ప్రధానమైన యూరోపియన్ భాగస్వాములతో సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
మూడు రోజుల ఐరోపా పర్యటనకు ఆదివారం రాత్రి బయలుదేరే ముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తుతం ఐరోపా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. అదే సమయంలో మనం ఎంచుకునేందుకు అనేక అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.
‘‘యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుంది.శాంతి, శ్రేయస్సులను కాంక్షించే భారత్ వంటి దేశాలకు ఈయూ దేశాలే భాగస్వామ్య పక్షాలు’’ అని ప్రధాని తెలిపారు.
జర్మనీ ఛాన్సరల్ ఓలాఫ్ షుల్జ్‌తో వివరణాత్మక ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు బెర్లిన్ పర్యటన ఒక అవకాశంగా ఉంటుందని తెలిపారు. జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు సోమవారం బెర్లిన్ను మోదీ సందర్శించనున్నారు. మంగళ, బుధవారాల్లో డెన్మార్క్‌లో పర్యటించి, అక్కడ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గంటారు. అలాగే, రెండో ఇండియాా- నోర్డిక్ సమ్మిట్‌కు హాజరవుతారు.
భారత్‌కు తిరిగివస్తూ ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్‌తో సమావేశం కోసం పారిస్‌లో కొద్దిసేపు ఆగుతారు. ఈ ఏడాదిలో ప్రధాని మోదీకి ఇది తొలి విదేశీ పర్యటనని భారత ప్రభుత్వ అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రధాని సుమారు 65 గంటలపాటు వివిధ దేశాలతో 25 సమావేశాల్లో పాల్గంటారని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్‌లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అవుతారు.
ప్రధానంగా ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో బంధాల బలోపేతమే మోదీ ప్రధాన ఎజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఈ అంశాలపైనా మోదీ విస్తృతంగా చర్చించనున్నారు.