‘‘యాసంగిలో నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా జాప్యం చేసి రైతులను నిండా ముంచారు. రైతులు పండించిన పంటలో 60 శాతం వడ్లను అడ్డికి పావుశేరు చొప్పున దళారులకు అమ్మేసుకుని రైతులు తీవ్ర నష్టపోయారు. కేసీఆర్ పాలనలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నరు. ఒక్కటి మాత్రం నిజం… ఎద్దు ఏడ్చిన వ్యవసాయం… రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడుదు.’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా 20వ రోజు మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ నాగారం స్టేజ్ వద్ద ధాన్యం కుప్పలను పరిశీలించారు. పంట కల్లాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
‘‘గత 20 రోజులుగా తమ ధాన్యాన్ని పంట కల్లాల్లో ఆరబోసి, అమ్మడానికి ఎదురు చూస్తున్నామని… అయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా మమ్మల్ని ముంచుతోంది’’ అని రైతులు సంజయ్ ఎధుట ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికే చాలా మంది రైతులు మిల్లర్లకు క్వింటాలుకు రూ 1300 కే విక్రయించుకున్నారని వాపోయారు.
కనీస మద్దతు ధర రూ.1960 ఉంటే దళారులకు అమ్మి క్వింటాలకు 400 నుండి 600 రూపాయలు నష్టపోయామని పలువురు రైతులు సంజయ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. వడ్లు కొంటామని ఒకసారి… కొనబోమని ఒకసారి… మళ్ళీ కొంటామని ఒకసారి కేసీఆర్ అంటూ మమ్మల్ని సర్వ నాశనం చేశారని రైతులు వాపోయారు.
వ్యవసాయం చేసి నష్టపోయామని, చావు అంచున ఉన్న తమను మీరే ఆదుకోవాలంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే.. రైతులు పండించిన వడ్లన్నీ కొనేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఎవరూ వడ్లను దళారులకు, మిల్లర్లకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని సూచించారు.
కేంద్రం కనీస మద్దతు ధర ఇస్తున్నందున… అంతకంటే తక్కువగా ఎవరూ అమ్ముకోవద్దని స్పష్టం చేశారు. రైతులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, డీఏపీ ధరలు పెరిగినప్పటికీ… రైతులపై భారం పడొద్దనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున సబ్సీడీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాబోయే ఖరీఫ్ ఒక్క సీజన్ కే రూ.60 వేల కోట్లకుపైగా సబ్సిడీ నిధులను రైతుల కోసం కేటాయించిన విషయాన్ని సంజయ్ ప్రస్తావించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులు, పేదల కోసం అనేక అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తోందని ధ్వజమెత్తారు.
కేంద్రంలో మాదిరిగా రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాజకీయ లబ్ది కోసం కేంద్రాన్ని బదనాం చేసేందుకు యత్నించిన కేసీఆర్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలి చేశారని మండిపడ్డారు.